కొండ కరిగించేస్తున్న పుత్రరత్నం | - | Sakshi
Sakshi News home page

కొండ కరిగించేస్తున్న పుత్రరత్నం

Published Fri, Sep 27 2024 3:18 AM | Last Updated on Fri, Sep 27 2024 3:18 AM

కొండ కరిగించేస్తున్న పుత్రరత్నం

అనంతపురం టాస్క్‌ఫోర్స్‌: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమార్కుల పుణ్యమా అని అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని కృష్ణమరెడ్డిపల్లి సమీపంలో ఉన్న పెద్దకొండ, ఆలమూరు సమీపంలోని ఎర్రకొండలు కరిగిపోతున్నాయి. రోజూ టిప్పర్లతో వందలాది ట్రిప్పుల ఎర్రమట్టిని నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ రెండు కొండల నుంచి తరలిస్తున్న ఎర్రమట్టి ద్వారా రోజూ రూ. 3 లక్షలకు పైగానే అక్రమార్కులు జేబుల్లోకి వేసుకుంటున్నారు. పోలీసులకు మాత్రం ఈ ఎర్రమట్టి వాహనాలు కనిపించకపోవడం విశేషం. రెండు నెలలకు పైగా ఎర్రమట్టి దందా సాగుతున్నా ఇటుకలపల్లి, అనంతపురం రూరల్‌, నగరంలోని వివిధ స్టేషన్ల పోలీసుల కంట పడకపోవడం ఆశ్చర్యకరం. ఇక భూగర్భ గనుల శాఖ అధికారులకు ఫిర్యాదులు అందినా కూడా ఆ కొండల వైపు చూడలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడి హస్తం..

ఎర్రమట్టి దోపిడీ వెనుక రాప్తాడు నియోజకర్గానికి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడి హస్తం ఉంది. ప్రారంభంలో టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలు ఎర్రమట్టిని తోలుకున్నారు. ఆ తర్వాత ముఖ్యనేత కుటుంబ సభ్యుడు రంగప్రవేశం చేశారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. తన తరఫున ఇటాచీలు, జేసీబీలను పెట్టి మట్టిని తవ్విస్తున్నారు. కొండల వద్ద ఒక వ్యక్తిని ఉంచి ఆయన ద్వారా ఒక్కో టిప్పరుకు రూ. 3 వేల దాకా వసూలు చేయిస్తున్నారు. రోజూ 90–110 ట్రిప్పులు తరలిపోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఎర్రమట్టి అక్రమ రవాణా విషయం రెండు కీలకశాఖల ఉన్నతాధికారుల దృష్టికీ వెళ్లింది. వారు కూడా మౌనం దాల్చడం అనుమానాలకు తావిస్తోంది. ఆలమూరు జగనన్న కాలనీకి ఆనుకునే ఎర్రకొండ ఉంటుంది. మట్టికోసం జేసీబీతో పెద్ద పెద్ద గుంతలు పెడుతున్నారు. చివరకు ఇళ్ల ప్లాట్ల మధ్యలో కూడా గుంతలు పెట్టేశారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సహజ వనరుల అక్రమ దోపిడీకి అడ్డుకట్ట వేస్తారా...లేదా? చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement