
సమ్మెలో ‘శ్రీరామరెడ్డి’ కార్మికులు
కళ్యాణదుర్గం రూరల్/కూడేరు: బకాయి వేతనాలు, పీఎఫ్‌తోపాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికులు శనివారం అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. కూడేరు మండలం పీఏబీఆర్ వద్ద ఉన్న శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్‌లోని మోటార్లను బంద్ చేశారు. దీంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం పీఏబీఆర్ వద్ద ఉన్న తాగునీటి ప్రాజెక్ట్, కళ్యాణదుర్గంలోని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పంప్ హౌస్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఉపాధ్యక్షుడు రామాంజి, సహాయ కార్యదర్శి అచ్యుత్‌ప్రసాద్ మాట్లాడారు. శ్రీరామరెడ్డి నీటి సరఫరా కార్మికులపై కూటమి ప్రభుత్వం నిర్యక్షంగా వ్యవహరిస్తోందన్నారు. కూటమి నాయకుల మాటలు నమ్మి గతంలో కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించారని, నాడు ఇచ్చిన హామీ మేరకు నేటికీ సమస్యలు పరిష్కరించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి 600 మంది కార్మికులు దసరా, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి వంటి పండగల పూట పస్తులుండాల్సి వచ్చిందన్నారు. గతంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సైతం స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీరామరెడ్డి వాటర్ వర్క్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి, మాజీ అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండారెడ్డి, కార్మికులు వన్నూరుస్వామి, ఈశ్వరయ్య, మల్లికార్జున, రమేష్, కాసీం, శ్రీనివాసులు, శ్రీనివాసులు రెడ్డి, రవి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.