
2024–25లో దేశ వ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాల విక్రయం
నాలుగేళ్లలో అమ్ముడుపోయిన వాహనాలు 61.66 లక్షలు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు తోడు కలవరపెడుతున్న కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విద్యుత్ వాహనాల(ఈవీ)లను వాడాలని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఓ నినాదం ఉద్యమంలా నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే మన దేశంలోనూ విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీలను రూపొందించి అమలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈవీల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాల విక్రయాలు జరగడమే ఇందుకు నిదర్శనం. 2023–24లో ఈ సంఖ్య 16 లక్షలు ఉండేది. జేఎంకే రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ విడుదల చేసిన ‘ఇండియా ఈవీ వార్షిక నివేదిక కార్డ్ 2025’ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది.
ఈవీ విక్రయాలు ఇలా..
2024–25 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన 20 లక్షల విద్యుత్ వాహనాల్లో సగం (60 శాతం)పైగా ఈవీ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అంటే 12 లక్షలు ఈవీ మోటార్ సైకిళ్ల విక్రయాలు జరిగాయి. 2023తో పోల్చితే ఈవీ విక్రయాల వృద్ధి 24 శాతం. ప్రయాణికులు, సరుకు రవాణాకు వినియోగించే త్రిచక్ర వాహనాల వాటా దాదాపు 36 శాతం. వీటి విక్రయాలు సుమారు 7 లక్షల వరకు జరిగాయి. మొత్తంగా 2020 నుంచి చూస్తే నాలుగేళ్లలో 61.66 లక్షల వాహనాల కొనుగోలు జరిగింది.
ఈ ఫలితం.. గత ప్రభుత్వ పుణ్యమే
ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. వీటికి సంబంధించి సర్వీస్ చార్జీలను నిర్ణయించాల్సిందిగా రాష్ట్రాలకు గతంలో కేంద్రం సూచించింది. ఈమేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోని గత ప్రభుత్వం చొరవ చూపింది.
ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) నేతృత్వంలో 266 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒక ఈవీ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. టెండర్లు కూడా పిలిచింది. ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలన్నీ నిలిచిపోయాయి.
‘ఇండియా ఈవీ వార్షిక నివేదిక కార్డ్ 2025’ ప్రకారం..
» ఈవీ విక్రయాలు, వినియోగంలో మొదటి ఐదు రాష్ట్రాలుః ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ
» ద్విచక్ర ఈవీ విక్రయాల్లో 50 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే జరిగాయి.
» తొలి మూడుస్థానాల్లో ..ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ సంస్థలు
» 70 శాతం విక్రయాలు ఈ మూడు సంస్థలవే.
» మూడు చక్రాల వాహనాల్లో 11% పెరుగుదల
» విద్యుత్ కార్ల విక్రయాల్లో 11 శాతం వృద్ధి
» గతేడాదిలో లక్ష విద్యుత్ కార్ల విక్రయాలు
» ఈవీ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్56 శాతంతో ముందంజ
» ఎంజీ మోటార్స్ 28 శాతంతో రెండో స్థానం
» ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు 3,834
» గతేడాది కంటే 3 శాతం క్షీణించిన ఈవీ బస్సుల విక్రయాలు