
పక్షం రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
పైగా ఏప్రిల్ నెల వేతనాల నిలుపుదల
రోజు రాత్రి 8 గంటలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌కూ ఆదేశం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఏలుబడిలో రాష్ట్రంలో చిరుద్యోగుల ఆవేదన అరణ్య రోదనగా మారింది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లలో పనిచేస్తున్న డాక్టర్లు తాజాగా ఈ జాబితాలో చేరారు. ఉద్యోగ భద్రత, వేతనాలు పెంపు వంటి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని 15 రోజులుగా సమ్మె చేస్తున్న డాక్టర్ల ఆవేదనను ప్రభుత్వం లెక్కచేయడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కక్ష సాధింపు చర్యలు షురూ..!
పైగా డాక్టర్లపై తీవ్ర కక్ష సాధింపు చర్యలకూ ప్రభుత్వం దిగుతోంది. ఇందులో ఏప్రిల్‌నెల వేతనాల నిలుపుదల ఒకటి. మరోవైపు దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా రాష్ట్రంలో డాక్టర్లు రోజు రాత్రి 8 గంటలకు ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగి్నషన్ సిస్టమ్) వేయాలని తాజాగా ఆదేశించింది. ఎవరికీ లేనట్టుగా డాక్టర్లు వారు పనిచేస్తున్న గ్రామాల్లోనే నివాసం ఉంటున్నారన్న నిర్ధారణ కోసం రోజు రాత్రి ఎనిమిది గంటలకు ‘మొబైల్’ ఎఫ్‌ఆర్‌ఎస్ వేయాలని నిర్దేశించడం జరిగింది. దీనితోపాటు ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేల ఇన్‌సెంటివ్‌లో రూ.5 వేలు పనిచేస్తున్న గ్రామాల్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం మెలిక పెట్టింది. నిర్దేశించిన హెల్త్ ఇండికేటర్స్‌లో వీరి పనితీరు ప్రాతిపదికన మిగిలిన రూ.10 వేల ఇన్‌సెంటివ్‌ను చెల్లించడం జరుగుతోంది.
సానుకూలంగా స్పందించాలి
ప్రజలు పడుతున్న అవస్థలు, మా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. మాతో చర్చించి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలి. – బి. సందీప్ కుమార్, జనరల్ సెక్రటరీ, ఏపీ సీహెచ్‌వో అసోసియేషన్
ఇళ్లు గడవడం కష్టంగా ఉంది..
సమ్మె చేస్తున్నామని మా వేతనం ఆపేశారు. ఇల్లుగడవడం కష్టమై, అనేక అగచాట్లు పడుతున్నాం. రాష్ట్రం మొత్తం పనిచేస్తున్న 10,032 మంది డాక్టర్లలో 8,700 మంది వరకూ మహిళలే ఉన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా సమ్మెలో పాల్గొంటున్నారు. – ఎం. అనుపమ, అధ్యక్షురాలు, ఏపీ సీహెచ్‌వో అసోసియేషన్, పల్నాడు జిల్లా