దళితులకు.. ‘దేశం’ వర్గం దండన | Clashes Between Dalits And TDP Leader In Sri Potti Sriramulu Nellore District, More Details Inside | Sakshi
Sakshi News home page

దళితులకు.. ‘దేశం’ వర్గం దండన

May 13 2025 4:21 AM | Updated on May 13 2025 2:51 PM

Clashes Between Dalits And TDP leader in Sri Potti Sriramulu Nellore

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తంచేస్తున్న దప్పళంపాడు దళితులు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళితులపై సామాజిక బహిష్కరణ కత్తి

గ్రామంలో అర్ధరాత్రి ఈలలు వేశారని దళిత యువకులపై టీడీపీ పెత్తందారుల దాడి 

అదేమని ప్రశ్నించినందుకు మంచినీళ్లు ఇవ్వకుండా, పాలు పోయనీయకుండా ఆంక్షలు

పక్క గ్రామాలకు కూడా హుకుం

ఉపాధి పనులకూ రానీయని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ 

దళితులెవరూ గ్రామంలోకి రావొద్దంటూ మైక్‌లో ప్రకటన

న్యాయం చేయాలంటూ సబ్‌కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితులు

చంపేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితుల గగ్గోలు

కందుకూరు:  అధికార టీడీపీ పెత్తందారులు దళితు­లపై విచక్షణా­రహితంగా దాడిచేయ­డమే కాక వారు గ్రామంలోకి రాకుండా.. వారికి తాగునీరు, వ్యవసాయ, ఉపాధి పనులు లేకుండా, చివరికి.. పాల కేంద్రంలో వారు పాలు కూడా పోయనీయకుండా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామంలో మైకులో బహిరంగంగా కూడా ప్రకటించారు. దీంతో.. బాధితులు రెండ్రోజులుగా అల్లాడిపోతు­న్నారు. పైగా.. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు వాపోతు­న్నారు. 

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూ­రు జిల్లా గుడ్లూరు మండలం దప్పళంపాడు గ్రామంలో ఈ దారు­ణం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..  మూడ్రోజుల క్రితం గ్రామంలో అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని యువకులు ఈలలు వేసుకుంటూ వెళ్లారు.

ఇది చేసింది గ్రామానికి చెందిన దళిత యువకులేనని భావించిన గ్రామస్తులు మరుసటి రోజు గ్రామంలోకి వచ్చిన జడా చక్రి, చెరుకూరి కార్తీక్‌ (నాని) అనే యువకులపై దాడిచేసి కొట్టారు. దీంతో వారు జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పారు. దళితులంతా కలిసి తమ యువకులను ఎందుకు కొట్టారంటూ గ్రామస్తులను ప్రశ్నించారు. ఈ విషయం ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. 

ఎవరు గొడవ చేశారో వారిని పట్టుకుని నిలదీయాలేగానీ అకారణంగా తమ పిల్లలను పట్టుకుని కులం పేరుతో తిడుతూ ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ఇది ఆ గ్రామ టీడీపీ పెత్తందార్లకు కోపాన్ని తెప్పించింది. అంతే.. రెండ్రోజు­లుగా దళితులను గ్రామం నుంచి పూర్తిగా సాంఘిక బహిష్కరణ చేశారు. మాదిగ­పల్లెకు చెందిన వారెవరూ గ్రామంలోకి రావద్దంటూ, గ్రామంలో ఎవరూ వారికి తాగునీరు ఇవ్వొదని.. పొలాల్లోకి కూడా రానీయకూడదంటూ దేవాలయంపై ఉండే మైక్‌లో ప్రకటించారు.

ఆర్వో ప్లాంట్‌ మూసివేత.. పొలాల్లో పనులకూ నో ఎంట్రీ..
ఈ ప్రకటన నేపథ్యంలో.. గ్రామంలోని ఆర్వోప్లాంట్‌ వద్ద దళితులెవరూ నీరు పట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. ఇది తెలీక నీరు పట్టుకోవడానికి వెళ్తున్న యువకులను గ్రామస్తులు ఆపి బలవంతంగా వెనక్కి పంపారు. పైగా.. ఆర్వో ప్లాంట్‌ను పూర్తిగా మూసేశారు. అదే సమయంలో పక్క గ్రామాలకు కూడా ఫోన్‌చేసి దప్పళంపాడుకు చెందిన మాదిగలు ఎవరైనా నీరుకోసం వస్తే వారికి ఇవ్వొద్దని బెదిరించారు. 

దీంతో బాధితులు రెండ్రోజులుగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. వీరెవరూ పాల కేంద్రంలో పాలు పోయకుండా కూడా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆదివారం రాత్రి కొందరు దళిత మహిళలు పాలుపోయడానికి కేంద్రానికి వెళ్లగా.. ‘మీ పాలు తీసుకోం, మా వద్దకు రావొద్దు’ అని తేల్చిచెప్పారు. ఇక పొలాల్లో పనులకు దళితులు ఎవర్ని రానివ్వొద్దంటూ కట్టుబాటు పెట్టారు.

మీకు ఉపాధి పనులూ లేవు.. రావద్దు..
ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులకు కూడా దళితులను రానివ్వకుండా గ్రామంలోని పెత్తందారులు అడ్డుకుంటున్నారు. పనులు చేయించే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పైడి ప్రసాద్‌ ఉపాధి పనులకు వెళ్లిన మహిళలను పనులకు రావొద్దంటూ వెనక్కి పంపారు. మాదిగోళ్లు ఎవరికీ ఉపాధి పనులులేవు.. ఎవరూ పనులకు రావద్దంటూ హుకుం జారీచేశారు. దీంతో చేసేదేమీ లేక పనులకు వెళ్లిన మహిళలు ఉసూరుమంటూ ఇంటికి తిరిగొచ్చారు. ఇలా.. రెండ్రోజులుగా దప్పళంపాడు పెత్తందారులు అంతా కలిసి మాదిగపల్లెను అష్టదిగ్బంధం చేశారు.

సబ్‌కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితులు..
ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలీక బాధితులందరూ సోమవారం సబ్‌కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజను ఆశ్రయించి తమ ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. ఆమె స్పందిస్తూ.. తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేస్తానని, యథావిధిగా ఆర్వో ప్లాంట్‌ వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాలని, అన్ని పనులు చేసుకోవాలని సూచించారు. ఉపాధి పనులకు రానీయకపోతే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే మంగళవారం గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం.. దళితులంతా కలిసి డీఎస్పీ బాలసుబ్రమణ్యంను కలిసి ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

చంపేస్తామని బెదిరిస్తున్నారు..
ఈ గొడవ జరిగిన తరువాత ఉపాధి పనులకు వెళ్తే.. మాదిగోళ్లు ఎవరికీ పనులులేవు, రావొద్దంటూ ఫీల్డ్‌ ఆఫీసర్‌ చెప్పాడు. నన్ను పనిలోకి రానీయలేదు. ఇంకేమీ చేయలేక ఇంటికొచ్చేశాను. రెండ్రోజులుగా కులం పేరుతో తిడుతూ.. ‘చంపేస్తాం, మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’.. అంటూ బెదిరిస్తున్నారు. – అంగలకుర్తి ప్రభావతి, దళిత మహిళ

కేంద్రంలో పాలు పోయించుకోలేదు.. 
ఆదివారం రాత్రి పాలు పోసేందుకు గ్రామంలోని పాల కేంద్రం వద్దకు పాలు తీసుకెళ్లాను. మీ పాలు మేం తీసుకోం. మాదిగలు పాలుపోయడా­నికి రావొద్దంటూ కేంద్రం నుంచి వెనక్కి పంపించేశారు. దీంతో చేసేదేమి లేక ఇంటికొచ్చేశాను. – కంకిపాటి మేరి, దళిత మహిళ

మంచినీళ్లు తెచ్చుకోకుండా ప్లాంట్‌ ఆపేశారు..
రెండ్రోజులుగా పూర్తిగా మంచినీళ్లు ఆపేశారు. ఆర్వో ప్లాంట్‌ వద్దకు రానీయకుండా ట్రాక్టరు అడ్డుపెట్టి అడ్డుకుంటున్నారు. అదేమని అడిగితే.. ‘ప్లాంట్‌ మాది, మీకు నీళ్లులేవు’.. అంటూ చెబుతున్నారు. అంతేకాక.. చుట్టుపక్కల గ్రామాలకు ఫోన్‌చేసి మాదిగోళ్లు వస్తే ఎవరూ నీళ్లు ఇవ్వొద్దంటూ చెబుతున్నారు. నీళ్లులేక రెండ్రోజులుగా అల్లాడుతున్నాం.– చెరుకూరి ఏసు, దళితుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement