
అమ్మ లాంటి ఊరుతోప్రేమ బంధం తెగిపోతుందా ?
పోలవరం నిర్వాసితుల్లో ఆందోళన
గ్రామాలను వీడలేక మనోవేదన
సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు
ఊరంటే కేవలం మట్టి కాదు..ఆ వాసనతో పెనవేసుకున్న ఇగిరిపోని బంధం. ఊరంటే ఇళ్లే కావు.. వాటితో ఉండే అనుబంధాల కాపురాలు. ఊరంటే ఇవే కాదు.. గడప గడపలో కనిపించే ఎడతెగని ఆప్యాయతలు.. వీధి వీధితో విడదీయలేని నేస్తుల అభిమానాలు.. దారి దారిలో విరబూసిన సుగంధాల పరిమళాలు.. ప్రతి కుడ్యం అందమైన
చిత్రం... చెట్టూచేమ, రాయీరప్పా.. బండిపెండి, పాదు, పసిరక, ఏరుగట్టు, పైరు గాలి.. ఇలా అన్నీ అపురూపాలే..
ఊళ్లే లేకుండా పోతున్నాయక్కో.. ఈ మట్టితో బంధం తెగిపోతున్నదక్కో.. ముల్లె సదురుకుని ఎల్లిపోవాలక్కో.. అంటూ పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఈ ప్రాంతాలను వీడి పునరావాస ప్రాంతాలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గ్రామాలతో పెనవేసుకున్న బంధం వీడనుండడంతో నిర్వాసితుల్లో ఆందోళన ప్రారంభమైంది. పుట్టిన ఊళ్లను, పెరిగిన ఇళ్లను, సాగు భూములను వదిలి వెళ్లలేక వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రాంతాలను వదిలివెళ్లడం ద్వారా తమ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కానున్నాయని ప్రధానంగా గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. – చింతూరు
పోలవరం ముంపు గ్రామాల్లో పరిహారం, పునరావాస ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ముందుగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన ప్రతి ముంపు గ్రామంలో గ్రామసభలను నిర్వహిస్తున్నారు. ముంపునకు గురవుతున్న గ్రామానికి సంబంధించిన నిర్వాసితుల జాబితాలను గ్రామసభల్లో వెల్లడిస్తున్నారు. దీంతో పరిహారం సొమ్ములు అందినవెంటనే గ్రామాలను ఖాళీచేయాల్సి వస్తుందని నిర్వాసితుల్లో జోరుగా చర్చ సాగుతోంది. కాగా ప్రస్తుతం గ్రామసభలు నిర్వహిస్తున్న అధికారులు నిర్వాసితుల అభిప్రాయాల మేరకు పునరావాస ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించడంతో అన్నిరకాల మౌలికసౌకర్యాలు కల్పిం చిన అనంతరం మాత్రమే వారిని ఇక్కడినుంచి తరలించాల్సి ఉంటుంది.
రాళ్లు రప్పలతో నిండిన భూములను దశాబ్దాలుగా ఎంతో కష్టపడి ఇప్పుడిప్పుడే సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ భూములు ఇప్పుడు ముంపునకు గురవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస ప్రాంతంలో భూములన్నీ రాళ్లు, రప్పలతో సాగుకు అనుకూలంగా లేవని వాటిని మళ్లీ అభివృధ్థి చేసి సాగులోకి తెచ్చేందుకు ఏళ్ల సమయం పడుతుందని వారు అంటున్నారు.
సంతలు కనుమరుగేనా?
గిరిజనులు నిత్యావసరాల కొనుగోలుకు సంతల పై ఆధారపడతారు. చింతూరులో ప్రతి బుధవా రం పెద్ద సంత జరుగుతుంది. సంతలకు మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులు అధికసంఖ్యలో వచ్చి వారానికి సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను సంతల్లో విక్రయించి ఆదాయాన్ని పొందుతుంటారు. సంతలు కేవలం వ్యాపార స్థలాలుగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచారవ్యవహారాలకు కేంద్రాలుగా, స్నేహబంధం కొనసాగించే ప్రాంతాలుగా గిరిజనుల జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుతో ఆయా సంత ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.
పండగలకు అధిక ప్రాధాన్యత
గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా పండగలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ప్రతి గ్రామంలో గ్రామదేవతలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తారు. తొలకరి ప్రారంభంతో పంటలు బాగా పండాలని భూమిపండగ, బీరకాయ, ఆనపకాయ తినేందుకు పచ్చపండగ, వరివిత్తనాలు నాటే సమయంలో కొత్తల్ పండగ, చిక్కుడు కాయలు తినేందుకు చిక్కుడు పండగల ను వారు నిర్వహిస్తారు. దీంతో పాటు పెళ్లిళ్ల సమయంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రతి మూడేళ్లకు కొలుపులు నిర్వహిస్తారు.
భూమిపండగ ఈ ప్రాంత గిరిజను లకు ఎంతో ప్రత్యేకమైనది. పండగలో భాగంగా పురుషులు సమీపంలోని అడవికి వెళ్లి సంప్రదాయ జంతువుల వేట కొనసాగిస్తుంటారు. మహిళలు తమ గ్రామాలకు సమీపంలోని ప్రధాన రహదారులపై సంప్రదాయ గిరిజన నృత్యాలు చేస్తూ వాహనదారుల నుంచి పండగ ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు.ప్రస్తుతం పోలవరం ముంపులో భాగంగా తమను మైదాన ప్రాంతాలకు తరలిస్తుండడంతో భూమి పండగ నిర్వహించే అవకాశాలు ఉండవేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.
ముంపుబారిన ఆదాయాన్నిచ్చే చెట్లు
గిరిజనులకు పలురకాల చెట్లు ఆదాయాన్ని అందిస్తుంటాయి. విప్ప, తాటి, చింత, మామిడిచెట్లు వీటిలో ప్రధానమైనవి. విప్పచెట్టు నుంచి విప్పపువ్వు, విప్పబద్ద, విప్పనూనె, చింతచెట్టు నుంచి చింతపండు, చింతపిక్కలు సేకరించి విక్రయించడం ద్వారా ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.10 వేల వరకు ఆదాయం పొందుతుంది. మామిడిచెట్టు ద్వారా ఏడాదికి రూ.20 వేలు, తాటిచెట్టు ద్వారా ఏడాదికి రూ.లక్ష వరకు, కూరగాయల సాగుద్వారా ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతుండగా ప్రాజెక్టు పూర్తయితే ఇవన్నీ ముంపుబారిన పడి గిరిజనులు ఆదాయం కోల్పోనున్నారు.
గ్రామ దేవతలను కోల్పోతున్నాం
పోలవరం ముంపుతో మా గ్రామదేవతలను కోల్పోతున్నాం. దేవతలను పూజిస్తే గ్రామానికి మంచి జరుగుతుందనే విశ్వాసంతో ప్రతిఏటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. పునరావాస కేంద్రాల్లో గ్రామదేవతలను ప్రతిష్టించేందుకు చాలా సమయం పడుతుంది. – సవలం సుబ్బయ్య, గ్రామపటేల్, చూటూరు, చింతూరు మండలం
ఊరు వీడాలంటే భయంగా ఉంది
దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుని, కూలీనాలీ చేసుకుని వచ్చిన సొమ్ములతో జీవనం సాగిస్తున్నాం. ముంపులో భాగంగా గ్రామాలను వీడాలంటే ఎంతో భయంగా ఉంది. పునరావాస ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నాం. – సవలం లచ్చమ్మ, చూటూరు, చింతూరు మండలం
భవిష్యత్తు తలుచుకుంటే ఆందోళనగా ఉంది
ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, పిల్లల్ని చదివిస్తూ జీవనం సాగిస్తున్నాం. కొత్త ప్రాంతంలో మా భవిష్యత్తును తలుచుకుంటే ఆందోళనగా ఉంది. మరోసారి కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. – సవలం దారయ్య, మాజీ సర్పంచ్, చూటూరు, చింతూరు మండలం
ఈ వ్యక్తి చింతూరు మండలం ఏజీకొడేరుకు చెందిన 80 ఏళ్ల అగరం నారాయణ. ఇతను ఇప్పటివరకు బ్యాంకు పనిమీద మండలకేంద్రం వెళ్లి రావడమే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లిందిలేదు. అలాంటిది పోలవరం ముంపులో భాగంగా గ్రామం విడిచి కొత్త ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని, త్వరలోనే గ్రామంతో బంధం తెగిపోతోందని దిగులు చెందుతున్నాడు. శబరినది పక్కనే నివాసముంటున్న తాను వరదలు వస్తే గ్రామంలోనే ఏదోచోట సురక్షిత ప్రాంతానికి వెళ్లేవాడినని అలాంటిది పోలవరం ఊరును ముంచేస్తుంటే ఇక శాశ్వతంగాగ్రామాన్ని వదలాల్సివస్తోందని మదనపడుతున్నాడు.
ఈ 90 ఏళ్ల వృద్ధురాలు ఏజీకొడేరుకు చెందిన బల్లెం ముత్తమ్మ. దశాబ్దాలుగా కుటుంబంతో కలసి గ్రామంలోనే నివాస ముంటోంది. ఆ రోజుకు తినేందుకు కూరలు ఏమీలేకున్నా పక్కనున్న చేలల్లోకి వెళ్లి పచ్చకూర కోసితెచ్చి వండు కుని ఆ పూటకు కడుపు నింపుకొంటామని చెబుతోంది. పోలవరం ముంపులో తమ గ్రామంతో బంధాన్ని వీడి కొత్త ప్రాంతానికి వెళ్లవలసి రావడం ఆవేదన కలగచేస్తోందని ఆమె అంటోంది. అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొందని, మాగ్రామం తప్ప ఎప్పుడూ కొత్త ప్రాంతాలకు వెళ్లలేదని, పునరావాసం పేరుతో ఇక్కడి నుంచి తరలిస్తుండడంతో ఈ అవసాన దశలో ఈ కష్టమేంటని ఆమె ఆవేదన వ్యక్తంచేస్తోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాలు, జనాభా వివరాలు
గ్రామాలు 190
ప్రాధాన్యతా క్రమంలో చేర్చినవి 32
కుటుంబాలు 13,323
జనాభా 56,108
గిరిజన జనాభా 30,669