చంద్రబాబును నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులు
తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు
రైతన్నలను అడుగడుగునా అడ్డగించిన ఖాకీలు
వైఎస్ జగన్ పిలుపుతో రైతులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నాయకులు
విజయవాడలో దేవినేని అవినాష్ పై జులుం, పార్టీ నేతల అరెస్టు
వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులతో హౌస్ అరెస్టు చేయించిన కూటమి సర్కారు
ప్రభుత్వ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవని రైతన్నలు
జిల్లా కేంద్రాల్లో ఉవ్వెత్తున రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల ర్యాలీలు
ఆరు నెలల చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకతకు నిరసన ర్యాలీలు అద్దం పట్టాయంటున్న రాజకీయ పరిశీలకులు
రైతుల ఆందోళన విజయవంతంకావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కదనోత్సాహం
రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇవ్వకుండా రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం
ధాన్యం, పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులకు ద్రోహం
ఉచిత పంటల బీమాను రద్దు చేసి కర్షకులను దిక్కుతోచని దుస్థితిలోకి నెట్టిన చంద్రబాబు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: అన్నదాతలు ఆగ్రహోదగ్రులయ్యారు! టీడీపీ కూటమి సర్కారు నయవంచక పాలన, చంద్రబాబు మోసాలపై రైతన్నలు ఛర్నాకోల ఝుళిపించారు!
ఎడ్ల బండ్లు.. వరి కంకులు.. ధాన్యం బస్తాలతో ‘రైతు పోరు’లో కదం తొక్కారు!!
అన్నం పెట్టే రైతన్నను కూటమి ప్రభుత్వం దగా చేయటాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శుక్రవారం నిర్వహించిన రైతు పోరుకు అన్నదాతలు ఉవ్వెత్తున తరలి వచ్చారు. ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి ర్యాలీల్లో పాల్గొన్నారు. వరి కంకులు చేతబట్టి కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటర్ల తరబడి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లలో డిమాండ్ పత్రాలను అందచేశారు. ధాన్యం బస్తాలను నెత్తిపై పెట్టుకుని మోస్తూ నిరసన తెలియచేశారు. కాలి నడకన కదం తొక్కారు.
సీఎం.. డౌన్ డౌన్! అంటూ ఎలుగెత్తి నినదిస్తూ తమ ఆక్రందన చాటారు. భీమవరం, రాజమహేంద్రవరం, కాకినాడ, బాపట్ల, నెల్లూరు, కర్నూలు.. ఒక ప్రాంతం అనే తేడా లేకుండా కలెక్టరేట్లకు దారి తీసే ప్రాంతాలన్నీ అన్నదాతల పద ఘట్టనలతో ఎరుపెక్కాయి!! వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను ఉసిగొల్పి గృహాల్లో నిర్బంధించినా.. నిరసనలో పాల్గొనడానికి కదలి వస్తున్న రైతులపై ఖాకీలు బెదిరింపులకు దిగినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిరసిస్తూ.. అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. తక్షణమే పెట్టుబడి సాయంగా రూ.20 వేలు అందించాలని.. పండించిన ధాన్యం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ఉచిత పంటల బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని నినదిస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో రైతులు కదం తొక్కారు.
సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు వైఎస్సార్‌సీపీ నేతలతో కలసి డిమాండ్ పత్రాలు అందజేశారు. ఆరు నెలల చంద్రబాబు ప్రభుత్వ పాలనపై పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు అండగా నిలుస్తూ వైఎస్సార్‌సీపీ నిర్వహించిన తొలి పోరాటం విజయవంతమవడంతో పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం తొణికిసలాడుతోంది.
అక్రమ అరెస్టులు.. నిర్బంధాలతో బెదిరించినా..
కూటమి ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద అన్నదాతలకు ఇవ్వాల్సిన రూ.20 వేలు ఇంతవరకూ ఇవ్వకపోవడం.. పండించిన ధాన్యం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు.
అన్నదాతను కుడి, ఎడమల దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున రైతులతో ర్యాలీలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలతో తరలి వచ్చారు. దీన్ని పసిగట్టిన కూటమి ప్రభుత్వ పెద్దలు వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులపై పోలీసులను ఉసిగొలిపారు.
ఉదయమే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు వారిని హౌస్ అరెస్టులు చేశారు. ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న రైతులను అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే పోలీసుల బెదిరింపులకు ఏమాత్రం వెరవకుండా జిల్లా కేంద్రాలకు రైతులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వైఎస్సార్‌సీపీ సారథ్యంలో నిర్వహించిన ర్యాలీల్లో కదం తొక్కారు.
కూటమి సర్కారు మోసాలను ఎండగడుతూ అనకాపల్లి టౌన్ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ వరకూ వందలాది మంది రైతులతో కలసి కార్యకర్తలు, నాయకులు 5 కి.మీ. మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ, కర్నూలు సహా అన్ని ప్రాంతాల్లోను వరి కంకులను చేతపట్టుకుని నిరసన తెలిపారు.
నెత్తిన ధాన్యం బస్తాలతో ర్యాలీ
రాజమహేంద్రవరంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ధాన్యం బస్తాలు నెత్తిన పెట్టుకుని బొమ్మూరు నుంచి కలెక్టరేట్ వరకూ 2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
ఎడ్ల బండ్లపై ర్యాలీలు...
నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం నగరాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎడ్ల బండ్లపై ర్యాలీల్లో పాల్గొన్నారు. ధాన్యం
కొనుగోళ్ల విషయంలో మొద్దునిద్ర నటిస్తున్న ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
విజయవాడలో ఉద్రిక్తత..
విజయవాడలో పోలీసు వలయాలను ఛేదించుకుని కలెక్టరేట్‌కు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో మ్యూజియం రోడ్డుకు చేరుకున్న నేతలు, రైతులను పోలీసు బలగాలు అడ్డుకుని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. గుణదలలోని తన ఇంటి నుంచి కలెక్టరేట్‌కు బయలుదేరిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను నైస్ బార్ వద్ద నడిరోడ్డుపై అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌కు తరలించారు.
విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును బయటికి రాకుండా అడ్డుకోవడంతో ఇంటి లోపల కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ను హౌస్ అరెస్టు చేసి నిర్బంధించారు. పార్టీ నందిగామ ఇన్‌చార్జి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి తదితరులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment