
అద్భుతమైన సందేశ కావ్యం రామాయణం
ఒంటిమిట్ట : సంస్కృతంలో ఆది కావ్యమైన రామాయణంలోని ప్రతిపాత్ర ఒక సమున్నతమైన సందేశాన్ని మానవజాతికి అందించిందని, అలాంటి అద్భుతమైన సందేశ కావ్యం రామాయణమని తిరుపతి–తిరుమల దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ పేర్కొన్నారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం ఆయన రామాయణంలోని తార, మండోదరీల మాటలు అనే అంశంపై ధార్మికోపన్యాసం చేశారు. కిష్కింధకాండలో కనిపించే తార పాత్ర తన భర్త అయిన వాలికి సుగ్రీవుడు శ్రీ రామచంద్రుల విషయంగా చెప్పిన నీతి బోధనలు ఎన్నటికీ శాశ్వతంగా నిలిచి ఉంటాయన్నారు. తిరుమల–తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్తలు ముమ్మిడి నారాయణ రెడ్డి, సిద్ద లింగారెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.