
గిట్టుబాటు ధర కరువై.. అప్పులు భారమై.!
ఓబులవారిపల్లె : తొలి నుంచి రైల్వేకోడూరు నియోజకవర్గం ఉద్యాన పంటలకు ప్రసిద్థి. అయితే తక్కువ వ్యవధిలో ఆదాయం వస్తుండడంతో దశాబ్ద కాలంగా కర్బూజ, దోస పంటలను రైతులు సాగు చేస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి అప్పుచేసి పంట సాగు చేస్తే చేతికి అందే సమయంలో దళారుల సిండికేట్‌తో అమ్ముడుపోక తోటలోనే కాయలు వదిలేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫలితంగా అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర లేక కలత చెంది ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా..
మండలంలోని వై.కోట గ్రామానికి చెందిన రామ జనార్దన్ (49) అనే రైతు సాగు చేస్తున్న దోస, కర్బూజ పంటలో తీవ్రంగా నష్టం రావడంతో కలత చెంది గుండెపోటుతో ఈనెల 4వ తేదీ మృతి చెందాడు. వ్యవసాయమే ఆధారంగా అప్పులు చేసి తనకున్న పది ఎకరాలలో అంతర పంటగా దోస, కర్బూజను సాగు చేశాడు. దళారులు సిండికేట్‌గా మారి టన్ను రూ. 4 వేలు నుంచి రూ. 5 వేలుగా నిర్ణయించారు. ఒక్కసారిగా ధర పడిపోవడంతో రైతు ఆందోళన చెందాడు. దళారులు రాకపోవడంతో తోటలోనే కాయలు కుళ్లిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో అప్పుచేసి పెట్టుబడి పెట్టిన రూ. 10 లక్షలలో ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో రోదించాడు. కాయలు తోటలోనే కుళ్లిపోగా మనస్తాపం చెంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. చివరకు రైతు కాయలు వదిలేసిన తోటలోనే మృతదేహాన్ని ఖననం చేశారు.
జీవనోపాధి కోల్పోయిన కుటుంబం..
రామ జనార్దన్ మృతి చెందడంతో పెద్దదిక్కు లేక వారి కుటుంబం జీవనోపాధి కోల్పోయింది. జనార్దన్‌కు భార్య సులోచన, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయికి వివాహం కాగా, పెద్దబ్బాయి వెంకటేష్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి మృతి చెందడంతో వెంకటేష్ చదువు చాలించి తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యాడు.
ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు..
లక్షలు అప్పుచేసి సాగు చేసిన పంట చేతికి రాకపోవడంతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలని నియోజకవర్గంలోని ప్రజలు కోరుతున్నారు. గిట్టుబాటు ధర లేక వందల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం నష్టపోతున్న దోస, కర్బూజ రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు .
దళారుల సిండికేట్‌తో
దగాపడుతున్న రైతులు
వందలాది ఎకరాల్లో దోస, కర్బూజ పంటను వదిలేస్తున్న వైనం
గుండెపోటుతో దోస రైతు మృతి
పట్టించుకోని ప్రభుత్వం

గిట్టుబాటు ధర కరువై.. అప్పులు భారమై.!

గిట్టుబాటు ధర కరువై.. అప్పులు భారమై.!