
ముగ్గురు పిల్లలు చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదు
రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల
ఓబులవారిపల్లె : చిట్వేలి మండలంలో ప్రమాదవశాత్తూ ముగ్గురు పిల్లలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర అదికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రాచపల్లి గ్రామం వద్ద నీటి కుంటలో పడి మృతిచెందిన చిన్నారులు చొక్కారాజు దేవాన్స్, చొక్కారాజు విజయ్, రెడ్డిచర్ల యశ్వంత్‌రాజు కుటుంబాలను మంగళవారం ఆయన పరామర్శించారు. మృతుల తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రమాద విషయంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు చనిపోతే కంటి చూపు చర్యగా కుటుంబ నాయకులు వచ్చి పరామర్శించి వెళ్లారన్నారు. వారికి ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించకపోవడం కూటమి ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. అనంతరం ఎంపీటీసీ బండారు గుండయ్య తల్లి ఇటీవల మృతి చెందారని తెలుసుకుని ఆయనను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, కనకరాజు, సిద్దు రాయల్, కోటిరెడ్డి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.