
రేషన్ కార్డులున్నాయ్.. బియ్యం ఇవ్వరేం?
సిద్దవటం : ‘రేషన్ కార్డులున్నాయ్.. తాము తీసుకోకుండా బియ్యం ఎక్కడికి పోతాయ్.. ఎప్పుడు డీలర్ షాపునకు వెళ్లి అడిగినా లేవంటూ సమాధానం చెబుతున్నారు’. అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మాధవరం–2 సచివాలయం వద్ద రేషన్ కార్డులు చేతపట్టుకొని మహిళలు మంగళ వారం ఆందోళన చేపట్టారు. స్థానిక వీఆర్వో రజనీకి సమస్యలను విన్నవించారు. వారు మాట్లాడుతూ మాధవరం–1 గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్‌కేఆర్ నగర్, బంగారుపేట గ్రామాలకు చెందిన రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీ చేయలేదని తెలిపారు. తమ ప్రాంతానికి చెందిన 15వ రేషన్ షాపునకు ఎప్పుడు వెళ్లినా బియ్యం లేవంటున్నారని, డీలర్ సరైన సమాధానం ఇవ్వడంలేదని ఆరోపించారు. చాలామంది పేదలు స్టోర్ బియ్యంపై ఆధారపడి జీవిస్తున్నారని, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమకు బియ్యం అందేలా చూడాలని వారు కోరారు.