
ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ
నందలూరు : డబ్బు విషయమై మండలంలోని ఆడపూరు గ్రామంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది. సంగీతం టీచర్ ఈశ్వరమ్మకు పార్ట్‌టైమ్ తెలుగు టీచర్ శ్రీదేవి కొంత నగదు ఇతరులతో ఇప్పించారు. ఆ డబ్బు అడగడంతో ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు.. ఐదు నెలలు తరువాత ఇస్తానని ఈశ్వరమ్మ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ జరిగింది. ప్రిన్సిపల్ ఎదుట ఇద్దరూ ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ విషయం పోలీసుల వరకు వెళ్లినట్లు సమాచారం.
మద్దతు ధరకే
కందుల కొనుగోలు
రాయచోటి జగదాంబ సెంటర్ : రైతుల నుంచి మద్ధతు ధరకే కంది కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ త్యాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ ఆధ్వర్యంలో కంది పండించి... ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి అన్నమయ్య జిల్లా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, నిమ్మనపల్లె, ములకలచెరువులోని కేంద్రాలలో క్వింటా రూ.7550కే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 144 మంది రైతుల నుంచి 55.90ఎంటీల కందులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.15లక్షలు 47 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామని, మరో 73 మంది రైతులకు సంబంధించి రూ.17 లక్షలు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కందుల సొమ్ము వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపారు.
ఈత సరదా.. ప్రాణం తీసింది
అట్లూరు : సోదరుడితో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బాలిక తేజశ్విని(14) నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు.. బంధువుల వివరాల మేరకు.. అట్లూరు మండలం కమలకూరు గ్రామానికి చెందిన చిట్టిబోయిన సిద్దయ్య(శివప్రసాద్), సుబద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారి ద్వితీయ కుమార్తె తేజశ్విని తొమ్మిదో తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం పొలాలకు వెళ్లింది. పొలం సమీపంలో ఉన్న కమలకూరు ఆనకట్ట వద్ద నీరు పుష్కలంగా ఉండడంతో సరదాగా ఈత కొట్టాలని అనుకుంది. తమ్ముడు నానితో కలిసి ఆనకట్ట వద్దకు వెళ్లి ప్లాస్టిక్ డబ్బాల సాయంతో నీటిలోకి దిగింది. ప్రమాదవశాత్తూ డబ్బా ఊడిపోయి అక్క నీట మునగడం చూసిన తమ్ముడు నాని కుటుంబీకుల వద్దకు వెళ్లి చెప్పారు. వారు హుటాహుటిని వచ్చి చూసేలోగా తేజశ్విని మృతిచెందిందని ఆమె బంధువులు తెలిపారు. అంతకుముందు అందరితో కలిసి సామూహికంగా బోజనం చేసి ఈతకు వెళ్లిన కుమార్తె ఇంతలోనే మృతిచెందడంతో తల్లి తండ్రులు రోదన స్థానికులను కలచివేసింది. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
జిల్లాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
కడప అర్బన్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని 111 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక బొలెరో క్యాంపర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనుమానితులు, పాత నేరస్థుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఎవరైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మానవత్వం చాటుకున్న భారతి సిమెంట్
ప్రొద్దుటూరు : మండు వేసవిలో కష్టపడుతున్న భవన నిర్మాణ కార్మికులపై భారతి సిమెంట్ యాజమాన్యం మానవత్వం చూపింది. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో పలు చోట్ల పనిచేస్తున్న తాపీ మేసీ్త్రలకు వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు శీతల పానీయాలు, రక్షణ కోసం టీషర్ట్‌లు, టోపీలు మంగళవారం అందించింది. ఈ సందర్భంగా భారతి సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్ కె.నాగేంద్ర తాపీ మేసీ్త్రలతో మాట్లాడుతూ రోబోటిక్ టెక్నాలజీతో భారతి సిమెంట్‌ను తయారు చేస్తున్నారని, శ్లాబ్‌ల నిర్మాణానికి తమ సిమెంట్ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, సీనియర్ టెక్నికల్ ఇంజినీరింగ్ ఛాయాపతి, చిన్న శ్రీకాంత్‌రెడ్డి, భవాని శంకర్, ఉదయ కిరణ్, సాయిప్రకాష్‌తోపాటు తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు.