
‘గిన్నిస్’లో చోటు
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణానికి చెందిన జి.శివసాయి నాగేంద్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఈ విషయాన్ని ఆ యువకుడు మంగళవారం ఇక్కడి విలేకరులకు తెలిపారు. గతేడాది డిసెంబర్ 1న మిస్టర్ అగస్టిన్, దండిగి వేణుగోపాల్, హల్లెలూయ సంగీత పాఠశాలల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వేదికగా గంట వ్యవధిలో కీబోర్డు వాయించే పోటీ ఏర్పాటు చేశారు. ఇందులో దేశ వ్యాప్తంగా 1046 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కీబోర్డు వాయించి అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ చేయడంతో ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ నెల 14న సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని అందజేశారు.
నృత్య ప్రదర్శనలో ప్రతిభ
మదనపల్లె: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పట్టణానికి చెందిన శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థి ఎస్.జైత్రమాధుర్ చోటు దక్కించుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన శాసీ్త్రయ నృత్యప్రదర్శనలో 4,218 మంది పాల్గొనగా, అందులో జైత్ర మాధుర్ నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. శ్రీ లలిత కళా ఆర్ట్స్ ఆధ్వర్యంలో గురువు బాలాజీ పర్యవేక్షణలో ఐదేళ్లుగా నృత్యశిక్షణ పొందుతున్నాడు. కళాశాల విద్యార్థి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడంపై కరస్పాండెంట్ డాక్టర్.ఆర్.గురుప్రసాద్, ప్రిన్సిపాల్ సురభి రమాదేవి, ప్రిన్సిపాల్ రాటకొండ వెంకటాచలపతి అభినందనలు తెలిపారు.
ఉపాధిలో పండ్ల
తోటలకు ప్రాధాన్యం
కేవీపల్లె: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పండ్లతోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీడీ వెంకటరత్నం అన్నారు. మంగళవారం మండలంలోని గ్యారంపల్లె పంచాయతీలో ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి పండ్ల తోటలు పెట్టుకోవడానికి ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో పని అడిగిన ప్రతి కూలీకి 100 రోజుల పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాదిలో కూలీలకు రూ. 300 దినసరి కూలీ కాగా ప్రస్తుతం రూ.307కు పెంచినట్లు పేర్కొన్నారు. అనంతరం ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

‘గిన్నిస్’లో చోటు