
వైవీయూకు రూ.10 కోట్ల ప్రాజెక్టు మంజూరు
కడప ఎడ్యుకేషన్: అకడమిక్, రీసెర్చ్ ఎక్సలెన్స్ దిశగా దూసుకెళ్తున్న యోగి వేమన విశ్వవిద్యాలయానికి మెగా రీసెర్చ్ ప్రాజెక్ట్ మంజూరైంది. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ‘పార్టనర్‌షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ (ఏ ఎన్ ఆర్ ఎఫ్–పి.ఎ.ఐ.ఆర్) పథకం కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి రూ. 10 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం యోగి వేమన విశ్వవిద్యాలయం లో రోగనిర్ధారణ, మెటబాలిక్, ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధుల చికిత్సలు, వ్యాధి నిఘా యంత్రాంగంపై దృష్టి సారించే మొత్తం 22 ప్రతిపాదనలను వివిధ విభాగాలలో కలసి 27 మంది అధ్యాపకులు సమర్పించారు. ప్రాజెక్టు నిధులతో పరిశోధనలు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వైవీయూ వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని స్పోక్ సంస్థగా ఎంపిక చేయడం, ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన ఎఎన్‌ఆర్‌ఎఫ్–పీఏఐఆర్ గ్రాంట్‌ను అందించడం వెనక విశ్వవిద్యాలయంలో నాణ్యమైన బోధన, పరిశోధన ఉన్నత ప్రమాణాలే కారణమన్నారు. పరిశోధన నిధులతో నాణ్యమైన పరిశోధనలు చేస్తామన్నారు. పరిశోధనల కేంద్రంగా, పరి శోధన వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ప్రొఫె సర్ కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా. పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్. రఘునాథరెడ్డి, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యంశర్మ పాల్గొన్నారు.
వైవీయూ వీసీ ఆల్లం శ్రీనివాసరావు