శాంతిభద్రతల పరిరక్షణలో ‘కూటమి’ విఫలం
నరసరావుపేట: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. పొలం తగాదాల విషయంలో ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న తన నియోజకవర్గంలోని శివపురానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు ఈశ్వర రెడ్డిని శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యం మూలంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒక మూల హత్యలు, దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. నేరస్తులను శిక్షిస్తారనే భయం లేకపోవటం వలనే దాడులకు పాల్పడుతున్నారని, ఒక చిన్న పొలం తగాదా విషయంలో గొడ్డలి, కత్తులతో నరకటంతో చావు బ్రతుకుల మధ్య వెంటిలేటర్‌పై ఉన్నాడంటే రాష్ట్రంలో ఏరకమైన పరిపాలన సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ఆడబిడ్డలకు రక్షణ లేదని, నేరం చేయడానికి ఎవరూ భయపడట్లేదన్నారు. వందల కేసులు రోజూ నమోదవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో అరగంటకు ఒక అత్యాచారం చొప్పున జరుగుతున్నాయన్నారు. ఐదు నెలల్లో 7393 మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పారన్నారు. ఐదేళ్లలో 35 వేలకు పైగా సంఘటనలు జరగనిచ్చి ఒక రికార్డు బుక్ చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి స్పష్టంగా కన్పిస్తుందన్నారు. తన నియోజకవర్గంలో ఈ క్షతగాత్రుడికి త్రిపురాంతకంలో 14ఎకరాల పొలం ఉందన్నారు. వీటిపై కోర్టులో దావాలు, గొడవలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈశ్వరరెడ్డి ప్రత్యర్థ్ధులను పోలీసులు ముందుగానే కట్టడి చేసి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్నారు. డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని మహిళలకు తాము రక్షణ కల్పించలేమని, వారి కుటుంబ సభ్యులే రక్షణ చేసుకోవాలని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దీని అర్థ్ధం మేం ఏమిచేయలేమని చెప్పకనే చెప్పినట్లుగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలుచేయలేక తమకు ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని ఎగ్గొట్టారన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఆ పదవి ఇవ్వకపోవటం ఇదే మొదటిసారి అన్నారు. వారు చేసే తప్పులను బయటకు తీస్తారనే ఉద్దేశంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీఏసీ సభ్యులైన తమకు ఆ పదవి రాకుండా చేశారన్నారు. 1981లో బీజేపీకి పార్లమెంటులో రెండే రెండు సీట్లు ఉంటే పీఏసీ పదవి ఇచ్చారన్నారు. ప్రజాపద్దుల విషయంలో ప్రతిపక్షం ప్రజలవైపు నిలబడుతుందన్నారు. పదవీ వ్యామోహం వలనే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మరో పదేళ్లు ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారన్నారు. వీరికి పదవీ వ్యామోహం తప్పితే ప్రజల కోసం పోరాటం చేసే ఆలోచన ఏ కోశానా లేదని తెలిపారు. ఇప్పటిౖకైనా ప్రజలకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు.
నాయకులకు పదవీ వ్యామోహం తప్ప ప్రజలపై దృష్టి లేదు
అరగంటకో నేరం
యర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
నరసరావుపేటలో క్షతగాత్రుడికి పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment