ఆధునిక చికిత్సలపై అవగాహన అవసరం
గుంటూరు మెడికల్: వైద్యరంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆధునిక పద్ధతుల్లో వ్యాధి నిర్ధారణ, చికిత్సలను వైద్యులు తెలుసుకోవాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి అన్నారు. శుక్రవారం గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) 66వ వార్షిక సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర సదస్సును గుంటూరు ఐఎంఏ శాఖ నిర్వహించటం అభినందనీయం అన్నారు. వైద్యరంగంలో పరిశోధనకు అవకాశాలు బాగా పెరిగాయని చెప్పారు. యువ వైద్యులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ.. వైద్యులు సీఎంఈ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స చేయడం ద్వారా రోగుల రద్దీని నిరోధించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పర్యవేక్షకులు డాక్టర్ ఎం. ఫర్నికుమార్ మాట్లాడుతూ వైద్యులకు సంవత్సరంలో ఆరు చొప్పున ఐదు సంవత్సరాలకు 30 క్రెడిట్ అవర్స్ లేనిదే రిజి స్ట్రేషన్ రెన్యువల్ జరగదని చెప్పారు. వైద్యులందరూ కార్యక్రమాలకు తప్పక హాజరుకావాలని కోరారు. ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి.ఫణిదర్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జి.నందకిషోర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి.సేవకుమార్, గుంటూరు ఐఎంఏ బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, కార్యదర్శి డాక్టర్ బాలినేని సాయికృష్ణ, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment