గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్ వెంకటమురళి
బాపట్లటౌన్: గిరిజనుల సమస్యలను తక్షణమే పరిష్కరించడమే ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కారవేదిక లక్ష్యమని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్ జె.వెంకటమురళి మాట్లాడుతూ ఇంటి స్థలం లేని ప్రతి ఎస్టీ కుటుంబానికి నివేశన స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. తొలుత ఆధార్ కార్డుల సర్వే పూర్తిచేయాలన్నారు. ఆయా కాలనీలలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే ఎస్టీలకు కేటాయించాలన్నారు. ఎస్టీ కుటుంబాలను మండల ప్రత్యేక అధికారులు దత్తత తీసుకుని ప్రభుత్వం అమలు చేసే పథకాలను వారికి వర్తింపచేయాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. వెదుళ్ళపల్లిలోని ఎస్టీ హాస్టల్ భవనంలో మార్కెట్ కొనసాగుతున్నందున అద్దె సొమ్ము గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికి చెల్లించాలన్నారు.
డిసెంబర్ 7న సీఎం బాపట్ల రాక
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల జిల్లాలో సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డిసెంబర్ 7న బాపట్ల జిల్లాకు వస్తున్నారన్నారు. బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‘లో పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో బాపట్ల పట్టణంలోని మునిసిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని కలెక్టర్ వెంకట మురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తమ్, ఆర్డిఓ పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
● కిశోర బాలికల్లో రక్తహీనత నివారణే కిశోరి వికాసం ధ్యేయమని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కిశోరి వికాసంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కిశోరి వికాసం వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఉమా పాల్గొన్నారు.
ధాన్యం సేకరణ వారంలో ప్రారంభించాలి
ధాన్యం సేకరణ వారం రోజుల్లో ప్రారంభించాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జేసీ చాంబర్‌లో జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలంలో గ్రామ సభలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఓపెన్ మార్కెట్లో ధాన్యాన్ని రైతులు అమ్ముకున్నా వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలన్నారు.
● ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఖచ్చితంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. మరుగుదొడ్ల అవశ్యకతను తెలియజేసే విధంగా అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
అధికారులు భూమిని గుర్తించాలి
ల్యాండ్ బ్యాంక్ కోసం రెవెన్యూ అధికారులు ఖాళీ భూమిని గుర్తించాలని కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. 13 అంశాలపై అధికారులతో సమీక్షించారు. నీటి సంఘాల ఎన్నికలు డిసెంబర్ 8, 11, 14 తేదీల్లో సమర్థంగా నిర్వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment