పల్నాటి ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు
పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు
కారెంపూడి: పల్నాటి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 30 నుంచి పల్నాటి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్నాటి వీరుల గుడిని ఎస్పీ సందర్శించారు. పీఠాథిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఎస్పీకి లాంఛనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరుల గుడిలో పల్నాటి వీరుల ఆయుధాలను ఎస్పీ పరిశీలించారు. ఆయుధాల విశిష్టతను పల్నాటి వీరాచార పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ ఎస్పీకి వివరించారు. కన్నమదాసు భైరవ ఖడ్గాన్ని, ఇతర ఆయుధాలను ఎస్పీ పరిశీలించారు. ఆయుధాలన్నీ ఆనాటివేనని, అయితే కొన్నింటికి కర్రలు మార్చడం జరిగిందని పీఠాధిపతి తెలిపారు. వీరాచారం నెరవేర్చలేని వారిచ్చిన కొన్ని ఆయుధాలు వీరుల గుడిలో ఉన్నాయని, మిగిలిన అన్ని ఆయుధాలు వంశపారం పర్యంగా పల్నాటి వీరాచారుల వద్దే ఉంటూ వస్తున్నాయని ఉత్సవాలకు వారు వంశపారంపర్యంగా వస్తున్న తమ ఆయుధాలతో తరలివచ్చి వీరులను తలుచుకుని తమ వీరాచారాన్ని నెరవేర్చుకుని వెళతారని వివరించారు. ఎస్పీ వీరుల గుడిని, నాగులేరును పల్నాటి యుద్ధం జరిగిన నాగులేరు తీరాన్ని పరిశీలించారు. ఉత్సవాల నిర్వహణ తీరు ఎలా ఉంటుందనే విషయమై పీఠాధిపతిని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. డిసెంబరు రెండవ తేదీ బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతం అమలు నాడు, 3వ తేదీ కోడిపోరు నాడు ప్రజల రాక ఎక్కువగా ఉంటుందని, ఉత్సవాల చివరిరోజు వీరుల ఆయుధాలు కళ్లికి ఒరిగే సమయంలో తోపులాట, ఉద్రిక్తతత ఉంటుందని పీఠాధిపతి వివరించారు. ఉత్సవాలకు లక్షన్నరదాకా ప్రజలు వచ్చే అవకాశం ఉందని, ఈ ఏడాది ఇంకా ఎక్కువగా రావచ్చని భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment