నేడు గుంటూరులో ‘పడమటి గాలి’ హోరు
తెనాలి: పడమటి గాలి...తెలుగు నాటకరంగంలో సంచలనం సృష్టించిన నాటకం. ఒకనాటి కన్యాశుల్కం, ఆ తర్వాత మాభూమిలా ఈనాటి ‘పడ మటి గాలి’ ఆంధ్రుల ఇతివృత్తాలకు, సామాజిక చైతన్యానికి కొలమానంగా నిలిచింది. చరిత్రలో నిలిచిపోయే సామాజిక నాటకం. కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత 153వ ప్రదర్శనగా ప్రేక్షకుల ముందుకొస్తోంది...అది కూడా సంక్షిప్తరూపంలో. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని అన్నమయ్య కళావేదికపై మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు పండు క్రియేషన్స్, కొప్పోలు సమాజం ప్రదర్శిస్తున్నారు. గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభిస్తారు.
పల్లె గుండె చప్పుడు
సముద్రాల కవతల ఒక బహుళజాతి కంపెనీ మెదడులో ఓ కొత్త వ్యాపారపు ఆలోచన మెరిసింది. దేశంలోని ఓ మారుమూల పల్లె తల్లి గుండె చప్పుడు మారిపోతుంది...చేను చెంప చెమ్మగిల్లుతుంది. అటువంటి ‘పడమటి గాలి’ సోకిన ప్రకాశం జిల్లాలోని మారుమూల పల్లెటూరి వృత్తాంతమే ఈ నాటకం. ఆర్థిక సరళీకృత విధానాలు, ప్రపంచీకరణ పెనుమాయలో పల్లెటూళ్లు ఎలా కకావికలమవుతుందీ కళ్లకు కట్టిందీ నాటకం. నగరాల్లోని విషసంస్కృతి, విలాసాల జీవిత లాలస పల్లైపెకి పంజా విసరటం, స్పీడ్‌మనీ, ఈజీమనీ మనుషులను పిచ్చివాళ్లను చేయటమే కాదు... ప్రేమానురాగాల మధ్య మెలగాల్సిన మనిషి కలుషితమై వికృతత్వాన్ని పొందుతాడు. మట్టితోనూ, చెట్టుతోనూ సజీవ సంబంధం కలిగిన రైతు, ఆ మట్టితో తన సహజత్వాన్నీ, అస్తిత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ నిలుపుకోవాలని అనుకుంటాడు. పడమటి గాలి నాటకం ఇతివృత్తం సంక్షిప్తంగా ఇదే.
నాలుగున్నర గంటల సుదీర్ఘమైన ఈ నాటకంలో 14 జిల్లాలకు చెందిన 70 మంది కళాకారులు నటించటం ఒక ప్రత్యేకత. ఆట, పాట, పద్యం లేకుండా ప్రేక్షకుడిని ఉత్కంఠభరితంగా చూసేలా చేసిన నాటకంగా ఇప్పటికే పేరుతెచ్చుకుంది. మొత్తం 13 దృశ్యాలు. పురాతన సురభి పద్ధతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి ప్రదర్శించటం మరో విశేషం! పోటీ నాటకాలకు భిన్నంగా ప్రజల జీవితాన్ని జనరంజకంగా, అదికూడా గ్రామీణ వాడుక భాషను యథాతథంగా రచించి రక్తికట్టించటం గొప్ప అంశం. ఐఏఎస్, డిప్యూటీ సెక్రటరీ, సీఐ సహా పదిమంది ప్రభుత్వ అధికారులు నటించిన నాటకం. ఇదే నాటకంపై యూనివర్సిటీల్లో పరిశోధనలు జరిగాయి. వేమన యూనివర్సిటీ ఎంఏ ఫైనలియర్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించింది.
నాటకం ప్రత్యేకతలు
సంచలనం సృష్టించిన నాటకం 153వ ప్రదర్శన కరోనా పరిస్థితుల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు కన్యాశుల్కం తర్వాత అంత గొప్ప నాటకంగా ప్రశంసలు పల్లెటూరు పరాయీకరణంపై జనరంజక నాటకం
Comments
Please login to add a commentAdd a comment