జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల దస్త్రాలన్నీ అధికారులు పునఃపరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. నిషేధిత భూముల జాబితా నుంచి 3,034 ఎకరాలు తొలగించగా ఇప్పటివరకు 2,500 ఎకరాలను పరిశీలించినట్లు చెప్పారు. మూడు రోజుల్లో పరిశీలన ప్రక్రియ ముగించాలన్నారు. పీజీఆర్‌ఎస్ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని చెప్పారు. 8 మండలాలలో అర్జీలు పెండింగ్‌లో ఉండడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం అన్ని మండల కేంద్రాలలో పీజీఆర్‌ఎస్ జరగాలన్నారు.
పంట కోతలు నిలిపివేయండి
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 10, 11, 12 తేదీలలో వరి పంట కోతలు నిలిపివేయాలని రైతులకు కలెక్టర్ సూచించారు. వరి కోత యంత్రాలు నడపరాదని, ఈ మూడు రోజులలో యంత్రాలు నడిపితే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
11న నీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్
నీటి సంఘాల ఎన్నికలకు ఈనెల 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ చెప్పారు. 14వ తేదీన టీసీలకు ఎన్నికలు జరుగుతాయని, 17వ తేదీన డిస్ట్రిబ్యూటరీ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలన్నారు.
1970 మంది ఆధార్ కార్డులు జారీ
ఆధార్ కార్డులు లేనివారు 2,850 మందిని గుర్తించగా, ప్రత్యేక డ్రైవ్ ద్వారా 1,970 మందికి ఆధార్ ఇవ్వడంపై సమీక్షించారు. మిగిలినవి త్వరలో పూర్తి చేయాలన్నారు. ఆధార్ కార్డులు వచ్చిన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వర్తింపజేయాలని సూచించారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారం లక్ష్యం
రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు లేని గ్రామంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. రెవెన్యూ సదస్సులను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. ఏ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారో ఆ గ్రామంలోనే రాజకీయ నాయకులు, రైతు సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, ఎన్జీవోలను కలుపుకుని ముందస్తుగా విస్తత ప్రచారం చేయాలన్నారు.
నీటి తీరువ వసూలుపై దృష్టి
నీటి తీరువా పన్నులు లక్ష్యం మేరకు వసూలు చేయాలని కలెక్టర్ ఉద్యోగులు ఆదేశించారు. జిల్లాలో రూ.13.45 కోట్లు డిమాండ్ ఉండగా వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీఆర్వోల ద్వారా వసూలు ప్రక్రియ వేగంగా చేపట్టాలని, ఇందుకోసం తహసీల్దార్లు రైతులను చైతన్య పరచాలన్నారు. ఆర్డీవోల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని ఆదేశించారు.
థియేటర్ల లైసెన్స్‌లపై ఆరా
జిల్లా వ్యాప్తంగా 35 సినిమా థియేటర్లు ఉండగా, 16 థియేటర్లకు మాత్రమే లైసెనన్స్ ఉండడంపై ఆరా తీశారు. తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పది రోజులలో తహసీల్దార్ల పనితీరులో పురోగతి కనిపించాలని అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్, బాపట్ల, రేపల్లె ఆర్డీవోలు పి గ్లోరియా, రామలక్ష్మి, కెఆర్‌ఆర్‌సీ ఎస్ డి సి లవన్న, కలెక్టరేట్ ఏఓ సీతారత్నం, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment