ఫీజు రీయింబర్స్‌మెంటును వెంటనే విడుదల చేయాలి
లక్ష్మీపురం: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటును విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి, కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. యశ్వంత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.2100 కోట్లు, వసతి దీవెన రూ.1400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు కోర్సులు అయిపోయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు అభ్యంతరం చెబుతున్నాయని, తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వచ్చే నెల నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు మొదలవుతున్నాయని, ఫీజలు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని కళాశాల యాజమాన్యాలు తెలియజేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శివ, జిల్లా సహాయ కార్యదర్శి అమరనాథ్, నగర కార్యదర్శి సాయి, ప్రతిపాడు నియోజకవర్గ అధ్యక్షులు డేవిడ్, నగర ఉపాధ్యక్షులు సాగర్, నగర సహాయ కార్యదర్శి వెంకట్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గౌతమ్, నితిన్, ఆనంద్, అంకమరావు, అజయ్, ప్రభాస్, చరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment