24 గంటల్లోనే బాలిక మిస్సింగ్ కేసు ఛేదన
విజయపురిసౌత్: విజయపురిసౌత్ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే మిస్సింగ్ కేసును ఛేదించారు. వివరాల్లోకి వెళితే మాచర్ల మండలం చింతలతండా గ్రామానికి చెందిన బాలిక జటావత్ విజయమ్మ గత సోమవారం అర్ధరాత్రి ఇంటిలో కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు విజయపురిసౌత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ షేక్ మహమ్మద్ షఫీ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు బృందాలుగా బాలిక కోసం పలు ప్రాంతాల్లో గాలించారు. తెలంగాణ ప్రాంతంలో బాలిక ఆచూకీ కనుక్కున్నారు. అనంతరం బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. 24 గంటల్లోపే బాలిక ఆచూకీ కనిపెట్టడంతో ఎస్‌ఐ షేక్ మహమ్మద్ షఫీ, ఏఎస్‌ఐలు సోమలా నాయక్, సోమయ్య, పొలీస్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.
సాగర్ జలాశయంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
విజయపురిసౌత్: మాచర్ల మండలం నాగార్జున సాగర్ కృష్ణా జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన మంగళవారం జరిగింది. విజయపురిసౌత్ ఎస్‌ఐ షేక్ మహమ్మద్ షఫీ కథనం ప్రకారం విజయపురిసౌత్‌లోని మేకల గొంది సమీపం లోని కృష్ణా జలాశయం వద్ద ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో పొలాలకు వెళ్తున్న రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.ఎస్‌ఐ మహమ్మద్ షఫీ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ప్రధానోపాధ్యాయురాలి హఠాన్మరణం
విధుల్లో ఉండగా అస్వస్థత
దుర్గి: కంచరగుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పి.భార్గవి (30) సోమవారం రాత్రి హఠాన్మరణం చెందారు. కంచరగుంట పాఠశాలలో సోమవారం విధులు నిర్వహిస్తున్న సమయంలో భార్గవి అస్వస్థతకు గురయ్యారు. నీరసంగా ఉండడంతో తోటి ఉపాధ్యాయులకు చెప్పి దుర్గిలో నివసిస్తున్న తన ఇంటికి చేరుకున్నారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావటంతో కారులో మాచర్ల వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు బంధువులకు తెలిపారు. గతంలో ముటుకూరు, ఆత్మకూరు ప్రాథమిక పాఠశాలలో ఆమె పనిచేశారు. విషయం తెలుసుకున్న ఎస్టీయూ నాయకులు, తోటి ఉపాధ్యాయులు భార్గవి మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. మంగళవారం పిడుగురాళ్ళ మండలంలోని జానపాడు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment