చిన్నారుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
చినగంజాం: బాలల హక్కులను పరిరక్షించడమే ధ్యేయంగా వ్యవస్థలన్నీ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి సూచించారు. మండల ప్రధాన కేంద్రం చినగంజాం తదితర చోట్ల ఆమె మంగళవారం విద్యాసంస్థలను, అంగన్‌వాడీ కేంద్రాలను, సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కడవకుదురు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. పలు రిజిస్టర్‌లు, స్టాక్, ఆహార పదార్థాలను ఆమె పరిశీలించి, సిబ్బందికి వివిధ సూచనలిచ్చారు. అనంతరం చినగంజాం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు తీరు, రిజిస్టర్‌లను పరిశీలించారు. 20 శాతానికిపైగా డ్రాప్ అవుట్స్ ఉన్నారని, 30 శాతానికిపైగా రెగ్యులర్‌గా గైర్హాజరవుతున్నారని గుర్తించారు.
హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి..
పాఠశాలలోని స్టాక్ రూంలో కోడిగుడ్లు, చిక్కి, రాగి పిండి అధిక మొత్తంలో నిల్వ ఉన్నాయని, విద్యార్థులకు సకాలంలో అందించడం లేదని గుర్తించారు. పాఠశాల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, ఎంఈఓ కోటేశ్వరరావులతో మాట్లాడారు. హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, ప్రతి ఉన్నత పాఠశాలలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని పద్మావతి సూచించారు. సచివాలయ మహిళా పోలీస్, వెల్ఫేర్ అసిస్టెంట్‌లకు పాఠశాలలోని బాలికలకు జరిగిన బాల్యవివాహాలపై ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయక పోవడంపై ఎంపీడీఓ ద్వారా మెమో జారీ చేయాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులతో ఆమె స్వయంగా మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆర్వో ప్లాంట్‌ను, స్కూల్ రికార్డ్స్‌ను పరిశీరలించారు. ఫిర్యాదుల బాక్స్‌ను అందుబాటులో ఉంచాలని, దానిని మహిళా పోలీస్, ఎంఈఓ పరిశీలన చేస్తూ ఉండాలని సూచించారు. అనంతరం చినగంజాం ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న భవిత కేంద్రాన్ని, మూడు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో ఎంపీడీఓ శ్రీనివాసమూర్తికి పలు సూచనలు చేశారు. ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరగడంతో పాఠశాల హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోకుంటే ఉపేక్షించేది లేదని తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావుకు ఆదేశాలిచ్చారు. గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శీలం రమేష్, జడ్పీ హై స్కూల్ హెచ్‌ఎం డి. రత్నకుమారి, ఎంఈఓ కోటేశ్వరరావు, సీడీపీఓ టి. ఝాన్సీ, సూపర్‌వైజర్‌లు వాణిశ్రీ, సుమలత, జిల్లా బాలల హక్కుల సంరక్షణాధికారి పురుషోత్తమరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ రవిచంద్ర, మహిళా పోలీస్ నాయుడు మీనాక్షి, సీఆర్పీ సురేంద్ర పాల్గొన్నారు.
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు పద్మావతి
చినగంజాంలోని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment