జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఇసుక దర్శి విద్యార్థి
మార్టూరు: జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఇసుక దర్శి గ్రామానికి చెందిన విద్యార్థి ఎంపికయ్యాడు. ఈ నెల 9వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గ్రామానికి చెందిన 11 సంవత్సరాల విద్యార్థి కర్పూరపు హితేష్ మొదటి బహుమతి సాధించాడు. తద్వారా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. హితేష్ ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్నాడు. బాలుడిని ప్రిన్సిపల్ మనీష్‌కుమార్, గురువు వెంకటేష్, తల్లిదండ్రులు కర్పూరపు శివపార్వతి, అనిల్ కుమార్, స్థానికులు అభినందించారు.
ట్రాక్టర్ల ఇసుక దందా
నరసరావుపేట: ట్రాక్టర్లకు ఉచిత ఇసుక అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. చోటామోటా టీడీపీ నేతలు జిల్లాలోని పలు రీచ్‌ల నుంచి ట్రాక్టర్లతో ఇసుకను తీసుకొచ్చి నరసరావుపేట పట్టణంలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో ఇసుక ట్రాక్టర్లు బారులు తీరి కనిపించడం దీనికి నిదర్శనం. ట్రాక్టర్ ఇసుకను రూ.5వేల నుంచి రూ.6వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టణంలోని ఇసుక, ఇతర బిల్డింగ్ మెటీరియల్ విక్రయించే మారుబేరగాళ్లకు అధికంగా సరఫరా చేస్తున్నారు. గృహ నిర్మాణదారులకు మాత్రం ఇసుక టన్ను రూ.1,500 తక్కువకు లభించడం లేదు.
ముగిసిన ఇంటర్ కాలేజ్ వాలీబాల్ టోర్నమెంట్
– ట్రోఫీ కై వసం చేసుకున్న కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు
గుంటూరు రూరల్: క్రీడా రంగంలో భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటే విధంగా క్రీడాకారులు తయారవ్వాలని, ఓటమిని గెలుపునకు సోపానాలుగా మలుచుకోవాలని ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. గత రెండు రోజులుగా మండలంలోని చౌడవరం గ్రామంలోగల కళాశాలలో జరుగుతున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంటర్ కళాశాలల వాలీబాల్ మెన్స్ టోర్నమెంట్ మంగళవారంతో ముగిసింది. టోర్నమెంట్‌లో ఫైనల్స్‌కి చేరిన నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు, బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల జట్ల మధ్య సాగిన పోటీలో ఇరు జట్ల క్రీడాకారులు ఆటలో వారి మెలకువలను ప్రదర్శిస్తూ సమాన పాయింట్స్ సాధిస్తూ ఉత్కంట భరితంగా ఆడారు. కృష్ణవేణి జట్టు మొదటి స్థానంలో నిలిచి ట్రోఫీని కై వసం చేసుకుంది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల జట్టు రెండో స్థానంలో నిలిచి రన్నరప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. తృతీయ స్థానంలో ఏఎన్‌యూ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు, నాల్గో స్థానంలో ధనలక్ష్మి కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు నిలిచాయి. టోర్నమెంట్‌లో ఉత్తమ నైపుణ్యాన్ని కనబరిచిన క్రీడాకారులను ఏఎన్‌యూ వాలీబాల్ (మెన్) జట్టుకి ఎంపిక చేశారు. ఎన్నికై న క్రీడాకారులు ఈనెల కేరళ యూనివర్సిటీలో జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్లు ఏఎన్‌యూ ఆబ్జర్వర్స్, సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రకటించారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్.గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె.కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె.రవీంద్ర, ఏఓ డైరెక్టర్ డాక్టర్ ఎన్‌వీ శ్రీనివాసరావు, ఏఎన్‌యూ టోర్నమెంట్ అబ్జర్వర్ డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment