నాణ్యమైన పంటల ఉత్పత్తిపై దృష్టి సారించాలి
నకరికల్లు: రైతులు నీటివనరులు సద్వినియోగం చేసుకోవడంతోపాటు తక్కువ నీటి వినియోగం, తక్కువ పురుగుమందుల వినియోగంతో నాణ్యమైన ఉత్పత్తులు సాధించేందుకు రైతులు దృష్టిసారించాలని జిల్లా ఉద్యానవన అధికారి వి.రమణారెడ్డి అన్నారు. ఇండో–ఇజ్రాయిల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్‌కు అనుసంధానమైన చేజర్ల, కుంకలగుంట గ్రామాల్లోని మిర్చి రైతులకు రైతుసేవా కేంద్రాల్లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యానవన పంటలలో పాటించాల్సిన మెళకువలు, సాగులో ఆదాయాన్ని పెంచుకోవడంపై అవగాహన కల్పించారు. ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు కల్పించే రాయితీలను పొందాలని సూచించారు. ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.రాధికారమ్య మాట్లాడుతూ మిరపలో రైతులు సమగ్ర యాజమాన్యం, సమగ్ర పోషకయాజమాన్యం పాటించాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై అవగాహన పెంచుకొని పంటపై ప్రభావం చూపకుండా చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయిల్‌ఫాం సాగు లాభదాయకంగా ఉంటుందని, రైతులు ఆ వైపు దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి దాసరి నవీన్‌కుమార్, గ్రామ ఉద్యానవన సహాయకులు పులి సాయివెంకట్, వర్ల వంశీ, కె.వెంకటకృష్ణ, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment