భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
పర్చూరు (చినగంజాం): రైతులకు భూమి తల్లిలాంటిదని.. గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చేయడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య లక్ష్యమని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం తన్నీరువారిపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ... డిసెంబరు 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు రాష్ట్రంలో 473 రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. భూ సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. రైతులు అడిగిన 1–బీ, అడంగల్ తదితర ధ్రువీకరణ పత్రాలకు ఎలాంటి రుసుం తీసుకోబోమన్నారు. రైతుల అన్ని భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మాట్లాడుతూ సదస్సులలో రెవెన్యూకు సంబంధం లేని అర్జీలను కూడా స్వీకరించి ఆయా శాఖలకు పంపించాలన్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తన్నీరువారిపాలెంలో రైతుల నుంచి వచ్చిన అర్జీలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఆళ్ల వెంకటరావు, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు, జిల్లా వైద్యాధికారి విజయమ్మ, బాపట్ల ఆర్డీవో గ్లోరియా, మండల ప్రత్యేకాధికారి శ్యాంసన్, తహసీల్దార్ బ్రహ్మయ్య, డీటీ అరుణ, ఆర్‌ఐ ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ భవనానికి స్థల పరిశీలన
బాపట్ల: రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు జిల్లాకు చేరుకున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం బాపట్లలోని కలెక్టరేట్ భవనాన్ని, నూతన కలెక్టరేట్ భవనానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment