గ్రామాల పరిశుభ్రతతోనే అభివృద్ధి
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, అభివృద్ధి సాధ్యమవుతుందని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ ముగింపు కార్యక్రమం మంగళవారం జెడ్పీ సమవేశ మందిరంలో నిర్వహించారు. గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.కళ్యాణ చక్రవర్తి అధ్యక్షత వహించిన సభలో హెనీ క్రిస్టినా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉందని, ఈ మార్పు ఇదేవిధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్లాప్ మిత్ర సిబ్బందిని శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. జిల్లాస్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల సుందరీకరణ, వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రత్తిపాడు మండలం గనికపూడి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ కె.తులశమ్మ జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా పంచాయతీ అధికారి బీవీఎన్ సాయికుమార్, గృహ నిర్మాణశాఖ పీడీ జేవీఎస్‌ఆర్‌వీ ప్రసాద్, స్వచ్ఛ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అర్జునరావు, ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా సమన్వయకర్తలు షేక్ షఫీ, జి.సాయికుమార్ పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా
Comments
Please login to add a commentAdd a comment