రీ సర్వేకు సమాయత్తం అవ్వండి
బల్లికురవ: మండలానికి ఒక గ్రామాన్ని సర్వేకు ఎంపిక చేశామని తక్షణమే రెవెన్యూశాఖ సిబ్బంది, సమాయత్తం అవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ కోరారు. గురువారం సాయంత్రం బల్లికురవలో బల్లికురవ, సంతమాగులూరు, మార్టూరు, యద్దనపూడి మండలాల రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షంచారు. గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులో అందే అర్జీలను తక్షణమే పరిష్కరించాలన్నారు. పరిష్కరించకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు తెలియజేయాలన్నారు. రీ సర్వేకు సంబంధించి బల్లికురవ మండలంలోని గుంటుపల్లి, సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లి, మార్టూరు మండలంలోని రాజుపాలెం, యద్దనపూడి మండలంలోని పూనూరు గ్రామాలను ఎంపిక చేశామని జేసీ వివరిచారు. శనివారం ఆయా గ్రామాల్లో ర్యాలీలు సోమవారం మొదటివిడత గ్రామసభ, జనవరి 17న రెండో విడత గ్రామసభ నిర్వహించి రీ సర్వేను ఫిబ్రవరి మసాంతంలోపు పూర్తి చేయాలన్నారు. సమీక్షలో బాపట్ల జిల్లా ఆర్డీవో గ్లోరియా, ఏడీ కనకప్రసాద్, తహసీల్దార్‌లు రవినాయక్, రవిబాబు, ప్రశాంతి, రవికుమార్ పాల్గొన్నారు.
నేడు ఎస్టీలకు
ప్రత్యేక గ్రీవెన్స్ సెల్
బాపట్ల: జిల్లాలో ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెనన్స్ సెల్ కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్ జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్‌ను జిల్లాలోని ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మంగళగిరి బాలికకు అవార్డు ప్రదానం
మంగళగిరి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి మంగళగిరి బాలిక పురస్కారం స్వీకరించింది. మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ స్కేటింగ్‌లో రాణిస్తోంది. గురువారం బాల పురస్కార్ అవార్డు కింద రాష్ట్రపతి నుంచి బంగారు పతకం అందుకుంది. న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ స్థాయి స్కేటింగ్ పోటీలలో రాణించినందుకు ఈ అవార్డు పొందింది. ఆమెను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, కమిషనర్ అలీంబాషా తదితరులు అభినందించారు.
కొండవీటి వాగు
ఆధునికీకరణకు ఏర్పాట్లు
తాడేపల్లి రూరల్: ఉండవల్లి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నుంచి కొండవీటి వాగు పొడవునా సీఆర్‌డీఏ అధికారులు విస్తరణ, ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించారు. అందులో భాగంగా గురువారం ఉండవల్లిలో పలుచోట్ల మార్కింగ్ చేశారు. వాగు వెంబడి 350 అడుగుల వరకు స్థలాన్ని సేకరించనున్నారు. కుడి, ఎడమ వైపుల 30 అడుగులు చొప్పున విస్తరించాలని నిర్ణయించారు. వాగు నుంచి ఉండవల్లి అమరాతి రోడ్డు వైపు దాదాపు 250 అడుగుల వరకు భూమి సేకరించాల్సి వస్తోంది. కొలతలు వేసిన ఉండవల్లిలో గుంటూరు చానల్ – ఆంజనేయస్వామి గుడి వరకు వాగు వెంబడి చాలా నివాసాలు తొలగించాల్సి వస్తోంది. భూమికి బదులు భూమి, చదరపు గజానికి రూ.5 వేలు వంతున ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఉండవల్లి అమరావతి రోడ్డు పక్కనే ఉన్న దేవస్థానం భూముల్లో ఈ కేటాయింపులు ఉంటాయని అంటున్నారు.
నేడు జిల్లా స్థాయి
ఫెన్సింగ్ పోటీలు
గుంటూరువెస్ట్ (క్రీడలు): గుంటూరు ఫెన్సింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ –17 బాలబాలికల జిల్లాస్థాయి ఫెన్సింగ్ పోటీలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.అశోక్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment