పోలింగ్‌కు రెడీ.. | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు రెడీ..

Published Thu, Feb 27 2025 1:01 AM | Last Updated on Thu, Feb 27 2025 12:59 AM

-

ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ

ఉమ్మడి జిల్లాలో టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికకు 6,111 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,440 మంది, మహిళా ఓటర్లు 2,671 మందితో జాబితా సిద్ధమైంది. జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం జిల్లాలో 4,089మంది ఓటర్లకు గాను పురుషులు 2,372 మంది, మహిళలు 1,717, భద్రాద్రి జిల్లాలో 2,022 మంది ఓటర్లకు గాను పురుషులు 1,068, మహిళా ఓటర్లు 954 మంది ఉన్నారు. రెండు జిల్లాలో కలిపి 47 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఖమ్మం రిక్కాబజార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగు కేంద్రాలు ఉండగా, 1,986 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆతర్వాత జలగంనగర్‌లోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో 488 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన 24 కేంద్రాల్లో సగానికి పైగా ఓటర్లు ఈ కేంద్రాల్లోనే ఓటు వేయనున్నారు. అలాగే, భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా భద్రాచలంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 250 మంది, ఇల్లెందులోని జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో 210 మంది, చుంచుపల్లిలోని బాబుక్యాంపు బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో 175 మంది ఓటర్లు ఉన్నారు.

కేంద్రాలకు చేరిన సిబ్బంది

ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు బుధవారం రాత్రి వరకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో పోలింగ్‌ సామగ్రి పంపిణీని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో ఏ.పద్మశ్రీ పర్యవేక్షించారు. ఖమ్మం జిల్లాను ఎనిమిది రూట్లుగా విభజించి సిబ్బందిని ఆర్టీసీ బస్సుల్లో పంపించారు. కాగా, పోలింగ్‌ కేంద్రాలను పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనే 56 మంది పీఓల (ప్రిసైడింగ్‌ అధికారులు)కు గాను ఖమ్మం జిల్లాలో 28 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 28 మంది ఉన్నారు. వీరు కాక ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టార్‌ అధికారులు విధులు నిర్వర్తిస్తారు. పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ బాక్సులను నల్లగొండలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రానికి తరలించేలా ఏర్పాట్లు చేశారు.

ఆ రెండు ప్రాధాన్యతలే కీలకం

ఈ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఓన్నారు. దీంతో ఓటర్లు 1నుంచి 19 వరకు ప్రాధాన్యత ఇస్తూ అంకెల ద్వారా ఓటు వేయొచ్చు. అయితే, 1, 2వ నంబర్‌ వేసే ఓట్లకే ప్రాధాన్యత ఉంది. ఒకటో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో గెలుపు తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో విజేతను ఖరారు చేస్తారు. మొత్తం పోలైన ఓట్లలో 51శాతం వచ్చిన వారినే విజేతగా ప్రకటిస్తారు. 19మంది అభ్యర్థుల్లో ఒకటో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ వచ్చినా.. పోలైన ఓట్లలో వారికి ఈ ప్రాధాన్యత ఓట్లు 51 శాతంగా ఉంటేనే విజయం ఖరారవుతుంది. అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్లలో 51 శాతం ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూ.. తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్‌ చేస్తారు. ఇలా మొత్తం అభ్యర్థుల్లో చివరి వరకు ఎవరికి 51 శాతం ఓట్లు ఉంటే వారినే గెలుపు వరిస్తుంది. ఫలితంగా బరిలో ఉన్న అభ్యర్థులు ఒకటో ప్రాధాన్యత ఓటుతో పాటు రెండో ప్రాధాన్యత ఓటునూ కీలకంగా తీసుకున్నారు. గత ఎన్నికల్లో అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందిన విషయం విదితమే.

ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవాలి

కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌

కొత్తగూడెంఅర్బన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత గల ఉపాధ్యాయులంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కొత్తగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఆయన అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ సాగుతుందని చెప్పారు. జిల్లాలో 23 పోలింగ్‌ కేంద్రాలు, ఏడు రూట్లు ఏర్పాటు చేశామని, ఒక్కో రూట్‌కు ఒక్కో సెక్టార్‌ అధికారితో పాటు ఒక్కో రూట్‌ అధికారిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ఉండవని, బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే ఓటు వేయాల్సి ఉంటుందని, బ్యాలెట్‌ పేపర్‌పై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఫొటో ఉంటాయని, ప్రాధాన్య క్రమంలో నచ్చి న అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడిలో నంబ ర్లు వేయాలని అన్నారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వినియోగించాలని, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్‌ దారా ప్రసాద్‌ పాల్గొన్నారు.

నేడు టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు

ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ ఉమ్మడి జిల్లాలో 47కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు

ఖమ్మం – నల్లగొండ – వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు 47 కేంద్రాల్లో పోలింగ్‌ జరగనుంది. జిల్లా కేంద్రాల నుంచి ఉద్యోగులు సామగ్రితో బుధవారం సాయంత్రంకల్లా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

– సాక్షి ప్రతినిధి, ఖమ్మం

ఓటర్లు, పోలింగ్‌ సిబ్బంది వివరాలు

జిల్లా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మొత్తం

ఓటర్లు 4,089 2,022 6,111

పోలింగ్‌ కేంద్రాలు 24 23 47

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement