‘పవర్’ఫుల్ శిక్షణ
● ఆర్టీసీ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాల పెంపునకు నిర్ణయం ● రోజుకు 40 మంది చొప్పున 182 అంశాలపై అవగాహన ● రీజియన్‌లోని ఆరు డిపోల్లో తరగతులు
సత్తుపల్లిటౌన్: ప్రయాణికులు మరింత మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ వారికి సంస్థపై నమ్మకం పెంచడం, తద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇదేసమయాన ఉద్యోగుల సంక్షేమంపైనా దృష్టి సారించిన యాజమాన్యం ఏటా వైద్యపరీక్షలు నిర్వహిస్తోంది. ఈక్రమంలో ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరు, ఇతర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించేలా మరో కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
రద్దీ నేపథ్యాన...
రాష్ట్రప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా కండక్టర్లు, డైవర్లు, ట్రాఫిక్ సూపర్‌వైజర్లకు విధినిర్వహణ సవాల్‌గా మారిందని చెబుతున్నారు. ఈ నేపథ్యాన ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి యజమానిననే భావన కల్పించేందుకు ‘పవర్’ పేరిట శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల్లో ఈనెల 18వ తేదీన మొదలైన శిక్షణ వచ్చేనెల 2వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం ఏడు డిపోల్లో కలిపి 681 మంది ఆర్టీసీ డ్రైవర్లు, 427 మంది అద్దె బస్సు డ్రైవర్లతో పాటు 860 మంది కండక్టర్లు, 204 మంది ట్రాఫిక్ సూపర్‌వైజర్లు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. 2022 సంవత్సరంలో ‘ఒక గొప్పమార్పుకు ఇదే శ్రీకారం’, 2023లో ‘ట్యాక్ట్’ పేరిట కార్యక్రమాలు నిర్వహించిన విషయం విదితమే.
శిక్షణలో అంశాలు
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్లు, సిబ్బందిలో దృఢ సంకల్పం, వ్యక్తిత్వ వికాసం పెంపు, రహదారి భద్రత, ప్రయాణికులతో సత్ప్రవర్తన, వస్త్రధారణపై అవగాహన, ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ శిక్షణలో భాగంగా వీడియోలు, ప్రసంగాల ద్వారా వివరిస్తున్నారు. తొలుత డిపోల వారీగా అధికారులకు హైదరాబాద్ బస్ భవన్‌లో శిక్షణ ఇవ్వగా, వారి ఆధ్వర్యాన డిపోల్లో సిబ్బందికి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి.
182 అంశాలపై..
పవర్(పీక్ పర్‌ఫార్మెన్స్ త్రూ ఓనర్‌షిప్ విత్ ఎంపతి రిసాల్ప్) పేరిట ఈ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీ డిపోలో రోజుకు 40 మంది చొప్పున ఉద్యోగులకు డిపో మేనేజర్ ఆధ్వర్యాన శిక్షణ ఇస్తున్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 182 అంశాలపై వీడియోలు, చిత్రాలు ప్రదర్శిస్తూ అందులోని సారాంశాన్ని వివరించడమే కాక.. అప్పటికప్పుడే పరీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే, స్కిట్ల ప్రదర్శన ద్వారా సిబ్బందిలో సృజనాత్మకతను పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఎక్కువ ఫలితాలను సాధించడం, మరింత శక్తి వినియోగం ఆవశ్యకతను ఇందులో వివరిస్తున్నారు.
‘పవర్’ఫుల్ శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment