డైరెక్టర్(పా) నియామకం ఎప్పుడో?
● సింగరేణిలో 26 రోజులుగా ఖాళీగానే కుర్చీ ● పెండింగ్‌లో బిల్లులు, ఇతర ఫైళ్లు
సింగరేణి(కొత్తగూడెం): దక్షిణ భారతదేశానికే తలమానికంగా నిలుస్తున్న సింగరేణి సంస్థలోని కీలకమైన డైరెక్టర్(పా – పర్సనల్ అడ్మినిష్ట్రేషన్ అండ్ వెల్ఫేర్) పోస్టు ఎప్పుడు భర్తీ చేస్తారనే సందిగ్ధత నెలకొంది. ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ జి.వెంకటేశ్వరరెడ్డికి డైరెక్టర్ (పా)గా యాజమాన్యం నాలుగు మాసాల క్రితం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన పదవీకాలం జనవరి 31తో ముగియగా.. ఆనాటి నుంచి డైరెక్టర్(పా) పోస్టు ఖాళీగానే ఉంటోంది. ఇటీవల డైరెక్టర్ పీపీ, డైరెక్టర్ ఆపరేషన్స్ పోస్టులను భర్తీ చేయగా, ఆ సమయంలోనే (పా) పోస్టు కూడా భర్తీ చేస్తారని భావించినా అలా జరగలేదు. ఫలితంగా కంపెనీకి సంబంధించిన బిల్లులు, ఇతర ఫైళ్లు పేరుకుపోతున్నట్లు సమాచారం.
2014 నుంచి అదనపు బాధ్యతలే..
సింగరేణి సంస్థలో సీఎండీ తర్వాత డైరెక్టర్(పా) పోస్టును కీలకంగా చెబుతారు. దీంతో ఈ పోస్టులో ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉండగా యాజమాన్యం, ప్రభుత్వం 2014 నుంచి అదనపు బాధ్యతలతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. 2011లో ఈ స్థానంలో ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను నియమించగా, తెలంగాణ ఏర్పడ్డాక ఆయనను బదిలీ చేశారు. ఆపై డైరెక్టర్ ఫైనాన్స్‌గా వచ్చిన వివేకానంద, పవిత్రన్‌కుమార్, బలరామ్, ఆ తర్వాత డైరెక్టర్ ఆపరేషన్స్‌గా విధులు నిర్వర్తించిన చంద్రశేఖర్, డైరెక్టర్ పీపీగా పనిచేసిన వెంకటేశ్వరరెడ్డికి డైరెక్టర్(పా)గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. కానీ పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారి లేకపోవడంతో కార్మికులకు సంబంధించిన సమస్యలు పేరుకుపోతున్నాయని, పరిపాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈమేరకు ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారిని నియమించాలని కోరుతున్నారు.
రెండేసి పోస్టులతో ఇబ్బందులు..
సింగరేణిలో నిపుణులైన అధికారులు ఉన్నప్పటికీ జీఎంల నుంచి డైరెక్టర్ల వరకు ఒకే అధికారికి రెండేసి పోస్టులు కట్టబెడుతున్నారు. ఫలితంగా అధికారులు ఏ శాఖకూ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ కారణంగా వందలాది ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment