ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకాలు? | Donald Trump announced forthcoming tariff on pharmaceutical imports | Sakshi

ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకాలు?

Apr 9 2025 12:41 PM | Updated on Apr 9 2025 2:55 PM

Donald Trump announced forthcoming tariff on pharmaceutical imports

ఔషధాల దిగుమతులపై అమెరికా త్వరలోనే భారీ సుంకం విధించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఔషధ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లను పరస్పర టారిఫ్ పాలసీ నుంచి మినహాయించింది. కానీ తాజాగా ప్రకటనతో తిరిగి ఈ విభాగాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

‘మేము త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాన్ని ప్రకటించబోతున్నాం. వివిధ దేశాల్లో తయారీ కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు తిరిగి అమెరికా వచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతాయి. ఈ విభాగంలో యూఎస్‌ అతిపెద్ద మార్కెట్’ అని ట్రంప్ అన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక దిగుమతి సుంకాలను ఉదహరిస్తూ అమెరికా ఇటీవల భారతీయ వస్తువులపై 26 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది.

దేశంలో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన సమయంలో ఫార్మా రంగాన్ని అందులో నుంచి మినహాయించారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ప్రకటిస్తామని ట్రంప్ మార్చి 24న చెప్పారు. యుద్ధాలు, మరేదైనా అనిశ్చితులు తలెత్తినప్పుడు ఉక్కు, ఫార్మాస్యూటికల్స్ అవసరం ఉందన్నారు. స్టీల్‌, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై ఇప్పటికే 25 శాతం సెక్టోరల్ టారిఫ్‌లను వర్తింపజేసిన ట్రంప్ రాగిపై కూడా వీటిని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఫార్మాస్యూటికల్ ఔషధాలతో పాటు కలప, సెమీకండక్టర్ చిప్‌లతో సహా అదనపు సెక్టోరల్ లెవీలను ఆయన ప్రభుత్వం విడిగా పరిశీలించనుంది. అయితే వీటి అమలుకు ఎంత సమయం పడుతుందో మాత్రం స్పష్టతనివ్వలేదు.

భారత్‌పై ‍ప్రభావం

ఫార్మా దిగుమతులపై ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటిస్తే అమెరికాకు అత్యధికంగా ఔషధాలను సరఫరా చేసే దేశాల్లో ఒకటైన భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 2024లో దేశం ఔషధ ఎగుమతుల విలువ 12.72 బిలియన్ డాలర్లు. ఇది దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ఎగుమతి రంగంగా మారింది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారత ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2022లో కొన్ని సర్వేల ప్రకారం యూఎస్‌లోని వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌తో దాదాపు 40 శాతం మందులు ఇండియాకు చెందినవే కావడం గమనార్హం.

ఇదీ చదవండి: మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..

ఇదిలావుండగా, తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్‌ఎంసీ) అమెరికాలో ప్లాంట్లను నిర్మించకపోతే 100% వరకు పన్ను విధిస్తామని ట్రంప్ బెదిరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనను తప్పుబట్టిన ట్రంప్ అరిజోనాలోని ఫీనిక్స్‌లో ఉన్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం టీఎస్ఎంసీ యూఎస్‌ యూనిట్‌కు 6.6 బిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వడాన్ని ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement