
ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2025) తొలి త్రైమాసికంలో డీల్స్ జోరు పెరిగింది. జనవరి–మార్చి(క్యూ1)లో 29 బిలియన్ డాలర్ల విలువైన 669 లావాదేవీలు జరిగాయి. గత మూడేళ్లలో ఇవి అత్యధికం కాగా.. 2022 క్యూ1 పరిమాణాన్ని మించాయి. విలువలో 2022 క్యూ3ను అధిగమించాయి. కన్సల్టింగ్ దిగ్గజం గ్రాంట్ థోర్న్‌టన్ భారత్ డీల్ ట్రాకర్ వివరాల ప్రకారం విలీనాలు, కొనుగోళ్లు(ఎంఅడ్‌ఏ), పీఈ లావాదేవీలు ప్రధాన పాత్ర పోషించాయి.
ఐపీవోలు, క్విప్ లావాదేవీలను మినహాయిస్తే 24.4 బిలియన్ డాలర్ల విలువైన 636 డీల్స్ నమోదయ్యాయి. త్రైమాసికవారీగా అంటే 2024 క్యూ4తో పోలిస్తే పరిమాణంరీత్యా 28 శాతం, విలువరీత్యా 34 శాతం వృద్ధి సాధించాయి. వార్షికంగా చూస్తే డీల్ పరిమాణం 43 శాతం జంప్‌చేయగా.. విలువ 17 శాతం ఎగసింది. ఇందుకు ఇన్వెస్టర్ల విశ్వాసం, వ్యూహాత్మక పెట్టు బడులు పుంజుకోవడం సహకరించింది. ప్రధానంగా ఎంఅండ్‌ఏ విభాగంలో కొత్త చరిత్రను సృష్టిస్తూ 15.8 బిలియన్ డాలర్ల విలువైన 228 డీల్స్ నమోదుకావడం తోడ్పాటునిచ్చినట్లు గ్రాంట్ థోర్న్‌టన్ భారత్ పార్ట్‌నర్ శాంతి విజేత పేర్కొన్నారు.
భారీ లావాదేవీలు
ఈ ఏడాది క్యూ1లో ఆరు బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయి. మొత్తం డీల్ విలువలో వీటి వాటా 41 శాతానికి చేరింది. తద్వారా భారీ డీల్స్ హవాకు తెరలేచింది. పూర్తి ఏడాది(2025) ఇవే పరిస్థితులు కొనసాగే వీలున్నట్లు శాంతి అంచనా వేశారు. రిటైల్, బ్యాంకింగ్, పునరుత్పాదక ఇంధనం, ఈమొబిలిటీ తదితర అత్యధిక వృద్ధి రంగాలలో ఇన్వెస్టర్లు వ్యూహాత్మకంగా పెట్టుబడులు చేపడుతున్నట్లు వివరించారు. కాగా.. కన్సాలిడేషన్ లావాదేవీలు సైతం జోరందుకున్నట్లు నివేదిక పేర్కొంది.
అదానీ గ్రూప్, కోఫోర్జ్ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్, నిట్కో లిమిటెడ్ తదితరాలు పలు ఇతర సంస్థల కొనుగోళ్ల ద్వారా విస్తరిస్తున్నట్లు తెలియజేసింది. బజాజ్ అలియెంజ్ జనరల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో బజాజ్ గ్రూప్ 26 శాతం వాటా కొనుగోలు చేయడాన్ని ఈ జాబితాలో ప్రధానంగా ప్రస్తావించింది. ఇందుకు బజాజ్ గ్రూప్ 2.7 బిలియన్ డాలర్లు వెచ్చించిన విషయం విదితమే. పీఈ విభాగంలో 408 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ 8.6 బిలియన్ డాలర్లు. 2022 క్యూ3 తదుపరి ఇవి గరిష్టంకాగా.. డీల్ పరిమాణంలో 36 శాతం, పెట్టుబడుల్లో 66 శాతం పురోగతి నమోదైంది.