
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జనవరిలో 25 శాతం పెరిగి (2021 ఇదే నెలతో గణాంకాలు పోల్చి) 34.50 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతుల ఇదే నెల్లో 24 శాతం పెరిగి 51.93 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 17.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు...
► ఇంజనీరింగ్, పెట్రోలియం, రత్నాలు–ఆభరణాల రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. ఇంజనీరింగ్ ఎగుమతులు 24.11 శాతం పెరిగి 9.2 బిలియన్ డాలర్లకు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 95.23 శాతం పెరిగి 4.17 బిలియన్ డాలర్లకు, రత్నాలు–ఆభరణాల రంగం ఎగుమతులు 13.65 శాతం పెరిగి 3.23 బిలియన్ డాలర్లకు చేరాయి.
► సమీక్షా నెల్లో పసిడి దిగుమతులు 40.52 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లకు చేరాయి.
► ఫార్మా ఎగుమతులు 1.15 శాతం క్షీణించి 2.05 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
► క్రూడ్ ఆయిల్ దిగుమతులు 30 శాతం పెరిగి 11.96 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
ఏప్రిల్ నుంచి జనవరి వరకూ
ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో (ఏప్రిల్–జనవరి) ఎగుమతులు 46.73 శాతం పెరిగి 335.88 బిలియన్ డాలర్లకు చేరింది. దిగుమతులు ఇదే కాలంలో 62.65 శాతం ఎగసి, 495.75 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 159.87 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్యశాఖ వ్యక్తం చేస్తోంది.
సేవల రంగం ఇలా..
ఇదిలావుండగా సేవల రంగం ఎగుమతుల విలువ తొలి అంచనాల ప్రకారం జనవరిలో భారీగా 54.95% పెరిగి 26.91 బిలియన్ డాలర్లకు ఎగసింది. దిగుమతుల విలువ 60.32% పెరిగి 15.83 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో ఈ విభాగం ఎగుమతుల విలువ 25.31 శాతం వృద్ధితో 209.83 బిలియన్ డాలర్లకు చేరగా, ఇదే కాలంలో దిగుమతుల విలువ 27.69% పెరిగి 121.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
చైనా నుంచి దిగుమతులు తగ్గించుకుంటే ప్రయోజనం: ఎస్‌బీఐ రిసెర్చ్
ఇదిలాఉండగా, ఎస్‌బీఐ రిసెర్చ్ ఒక నివేదిక విడుదల చేస్తూ, భారత్ చైనా నుంచి తన దిగుమతులను సగానికి తగ్గించుకుంటే, అది దేశ స్థూల దేశీయోత్పత్తికి 20 బిలియన్ డాలర్ల మేర లాభం చేకూర్చుతుందని పేర్కొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు (పీఎల్‌ఐ) చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోడానికి దోహదపడుతుందని కూడా ఎస్‌బీఐ ఎకోరాప్ నివేదిక విశ్లేషించింది. 2020–21లో చైనా నుంచి భారత్ 65 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిపిందని నివేదిక పేర్కొంటూ, ఇందులో 39.6 బిలియన్ డాలర్ల విలువైన కమోడిటీలు, వస్తువులు పీఎల్‌ఐ స్కీమ్స్ (జౌళి, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, ఫార్మా, రసాయనాలు) పరిధిలోనికి వచ్చేవేనని విశ్లేషించింది.
చదవండి: క్రిప్టోలపై ఆర్‌బీఐతో చర్చలు జరుగుతున్నాయ్..