
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ఆ తర్వాత వెంటనే లాభాల బట్టి 200 పాయింట్ల వరకు పైకి దూసుకెళ్లాయి. మళ్లీ కాసేపటికే మార్కెట్ ఫ్లాట్గా మారింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో లాభాల బాట పట్టిన మార్కెట్.. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ సూచీల ఫలితాలతో చిన్న కుదుపులకు లోనైంది. రోజంతా సూచీలు ఊగిసలాటలో కొనసాగాయి. ముగింపులో, సెన్సెక్స్ 85.91 పాయింట్లు (0.15%) పెరిగి 55,550.30 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 35.60 పాయింట్లు లేదా 0.21% పెరిగి 16,630.50 వద్ద నిలిచింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.59 వద్ద ఉంది. నిఫ్టీలో సీప్లా, బిపీసీఎల్, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐఓసీఎల్ షేర్లు రాణిస్తే.. టాటా మోటార్స్, మారుతీ సుజుకి, నెస్లే ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఫార్మా ఇండెక్స్ 2 శాతం పెరిగితే, చమురు & గ్యాస్ సూచీలు 1 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
(చదవండి: అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!)