
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు తగ్గి 23,332కు చేరింది. సెన్సెక్స్(Sensex) 278 పాయింట్లు నష్టపోయి 76,778 వద్ద ట్రేడవుతోంది. దాంతో గత మూడు సెషన్ల నుంచి ర్యాలీ అయిన స్టాక్ మార్కెట్‌లో గురువారం ఉదయం ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.53 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.47 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 2.24 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 3.07 శాతం దిగజారింది.
ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్‌ను అనేక ఆర్థిక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన పరస్పర సుంకాలు అనిశ్చితిని సృష్టించాయి. తాత్కాలికంగా ఈ సుంకాలను 90 రోజులపాటు నిలిపేసినా ఇది మార్కెట్ అస్థిరతకు దారితీసింది. మార్చి నెలకు సంబంధించిన భారతదేశ టోకు ధరల సూచీ (డబ్ల్యుపీఐ) ఏప్రిల్ 15న విడుదలైంది. ఇది కాస్త ఊరట కలిగించింది. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం కూడా ప్రస్తుతం మార్కెట్‌లకు కీలకంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో పలు బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్‌లు ర్యాలీ అవుతున్నాయి.


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
