అప్రైజర్ చేతివాటం
కంచే చేను మేసిన చందాన ఓ అప్రైజర్
తాను పనిచేస్తున్న బ్యాంకుకే టోకరా
వేశాడు. అప్రైజర్‌గా ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని తక్కువ నాణ్యత ఉన్న బంగారాన్ని బినామీ ఖాతాల్లో తాకట్టు
పెట్టి రూ.40 లక్షలు రుణం పొందాడు.
ఈ బాగోతం ఆడిటింగ్‌లో బయటపడింది. ఈ సంఘటన యాదమరి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(యుబిఐ)లో కలకలం రేపింది.
● బినామీ ఖాతాలతో రూ.40 లక్షల రుణం!
● తక్కువ బంగారం తాకట్టు పెట్టిన వైనం
● ఆడిట్‌లో బయటపడ్డ బండారం
● యాదమరి యూనియన్ బ్యాంక్‌లో
కలకలం
● అధికారులు ప్రశ్నించడంతో రుణం చెల్లించిన అప్రైజర్
యాదమరి(పూతలపట్టు): యాదమరి యుబిఐలో అప్రైజర్‌గా భాస్కరాచారి కమీషన్ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. ఈ నెల 14వ తేదీ నుంచి బ్యాంకులో ఆడిటింగ్ చేస్తున్నారు. అప్రైజర్ తన బంధువుల పేరిట తొమ్మిది బినామీ ఖాతాలతో నగలు తాకట్టు పెట్టి రూ.40లక్షలు తీసుకున్నట్టు తేలింది. పైగా తాకట్టు పెట్టిన నగల విలువ మొత్తంగా రూ.10లక్షల వరకు మాత్రమే అయితే అతడు మూడురెట్లు ఎక్కువగా పొందినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో మొత్తంగా 17 సార్లు అతను ఇలా బినామీ ఖాతాలతో రుణం పొందాడని తేలింది. దీనిపై ఆడిటింగ్ అధికారులు నిలదీయడంతో అప్రైజర్ తాను కుదువపెట్టి తీసుకున్న రూ.40 లక్షల రుణాన్ని చెల్లించేశాడు. ఆడిట్ పూర్తి కాకపోవడంతో అతనికి బ్యాంకు సిబ్బంది తనఖా పెట్టిన నగలను తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రుణం చెల్లించినా తన నగలను తిరిగి ఇవ్వలేదని భాస్కరాచారి కొందరిని వెంటబెట్టుకొని బ్యాంకు అధికారులను నిలదీశాడు. బ్యాంకులో తనఖా ఉన్న నగలన్నీ పరిశీలించాల్సి ఉందని, అంతవరకూ తిరిగి ఇవ్వలేమని స్పష్టం చేశారు. యుబిఐలో ఏదో గోల్‌మాల్ జరిగిందని ప్రచారంలోకి రావడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని తమ నగల గురించి మేనేజర్ మురళిని నిలదీశారు. అప్రైజర్‌కు అంత రుణం ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు.
ఖాతాదారుల నగలు సురక్షితం
యూనియన్ బ్యాంక్‌లో సుమారు 4000 మందికి పైగా బంగారు నగలు తాకట్టు పెట్టి రుణాలు పొందారు. వాటి విలువ రూ.52కోట్లు. అప్రైజర్ భాస్కరాచారి 9 మంది నగల నాణ్యతను పరిశీలించి నాకు ఇచ్చిన నివేదిక ప్రకారమే నేను ఆ ఖాతాలకు రుణం మంజూరు చేశాను. ఆడిట్ అధికారుల పరిశీలనలో ఆ నగలు నాణ్యత తక్కువని, వాటి విలువ రూ.10లక్షలేనని, అయితే రూ.40లక్షలు రుణం తీసుకున్నట్టు ఆడిట్ అధికారులు గుర్తించారు. బినామీ ఖాతాలతో మోసగించినట్టు బండారం బయటపడడంతో భాస్కరాచారి బ్యాంక్ సిబ్బందికి ఆ నగదు ఇచ్చానని చెప్పడం ఎంతమాత్రమూ సరికాదు. ఆడిటింగ్ ముగిసినంతరం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఖాతాదారుల నగలన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఆందోళన చెందనవసరం లేదు.
–మురళి, మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాదమరి
Comments
Please login to add a commentAdd a comment