పేరు ఇళ్లకు.. తరలింపు కర్ణాటకకు..
పలమనేరు: కొందరు అక్రమార్కులు కౌండిన్య నది నుంచి ఇళ్ల నిర్మాణాల పేరుతో ఇసుకను ట్రాక్టర్లలో కర్ణాటకకు తరలిస్తున్నారు. ఎక్కడో ఇసుక డంపులు పెట్టుకుంటే కన్నడ ఇసుక వ్యాపారులు తాము రావడంలేదని తేల్చి చెప్పేశారు. దీంతో ట్రెండ్ మార్చిన ఇక్కడి ఇసుకాసురులు కౌండిన్య నుంచి నిత్యం తోడే ఇసుకను పట్టపగలే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో దించేస్తున్నారు. ఆపై అక్కడి నుంచి లొకేషన్ ఆధారంగా ఇసుకాసురులు స్పాట్‌కు వెళ్లకున్నా ఇసుక కర్ణాటకకు చేరుతోంది. అక్కడి స్మగర్లు సంబంధిత లొకేషన్‌కు వెళ్లి టిప్పర్లతో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళుతున్నారు.
ఎక్కడెక్కడంటే.. : కౌండిన్య నది నుంచి పలమనేరు రూరల్ మండలంలోని ముసలిమొడుగు, కృష్ణాపురం, సముద్రపల్లి, పెంగరగుంట, కూర్మాయి, జల్లిపేట, క్యాటిల్‌ఫామ్, గంగవరం మండలంలోని కూర్నిపల్లి, ఉయ్యాలమిట్ట, కలగటూరు, దండపల్లి, మబ్బువాళ్లపేట, పెద్దపంజాణి మండలంలో బొమ్మరాజుపల్లి, ముదరంపల్లి, గోనుమాకులపల్లి, చామనేరు, శివాడి, నిడిగుంటల నుంచి సమీపంలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో రహస్యంగా ఇసుక డంపులను నిల్వ చేస్తున్నట్టు సమాచారం.
ఎవరినడిగినా ఇంటి నిర్మాణాకని... : కౌండిన్యలో ఇసుకను తోడుతున్న ఎవరిని అడిగినా ఇంటి నిర్మాణానికని చెబుతున్నారు. నిత్యం కౌండిన్య నది పరిధిలో మూడు మండలాల్లోని 30 గ్రామాల్లో రోజుకు 300 లోడ్ల ఇసుక తరలుతుంటే ఈ ప్రాంతంలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయో? ఓ సారి అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలో టిప్పర్ ఇసుక రూ.25 వేల నుంచి రూ.30 వేలు పలుకుతుండడంత యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇసుక ఉచితం కాబట్టే పట్టుకోవడం లేదని, పాపం ఇళ్ల నిర్మాణాలకు తీసుకెళుతున్నారని భావించి మాట్లాడడం కొసమెరుపు.
మామను చంపిన అల్లుడికి జీవిత ఖైదు
మదనపల్లె : తండ్రి మరణానికి కారకుడనే నెపంతో మామను హత్య చేసిన అల్లుడికి జీవితఖైదు విధిస్తూ మదనపల్లె రెండో అడిషనల్ జిల్లా కోర్టు జడ్జి అబ్రహాం తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమంద గొల్లపల్లెకు చెందిన వెంకటసిద్ధులు(63) అనే వ్యక్తి 2017 ఆగస్టు 7వ తేదీన కలికిరి మండలం గుట్టపాళెం గొల్లపల్లె పొలాల వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. హత్య విషయమై వెంకటసిద్ధులు కుమారుడు నాగరాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమల ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేశారు. విచారణ బాధ్యతను అప్పటి చౌడేపల్లె సీఐ రవీంద్రకు అప్పగించారు. పోలీసు విచారణలో వెంకటసిద్ధులు అల్లుడు పి.సుధాకర(45)ను నిందితుడిగా గుర్తించారు. సుధాకర్ తండ్రి రెడ్డెప్ప మరణానికి మామ వెంకటసిద్ధులు చేయించిన చేతబడులు, క్షుద్రపూజలే కారణమని భావించి కక్ష పెంచుకుని, హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. గుట్టపాళెంలో జరిగే పాలేటమ్మ జాతరకు మామ వెంకటసిద్ధులును రావాల్సిందిగా కోరాడు. జాతరకు వచ్చిన మామను, పథకం ప్రకారం వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడు. పోలీసు విచారణలో అల్లుడు మామను హత్యచేసినట్లుగా నిర్ధారణ కావడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఏడేళ్లపాటు కేసు విచారణ మదనపల్లె రెండో అదనపు జిల్లా కోర్టులో జరిగింది. నిందితుడిపై నేరం రుజువు కావడంతో జీవితఖైదుతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం జడ్జి అబ్రహాం తీర్పు చెప్పారు. కేసులో ఏపీపీ జయనారాయణరెడ్డి వాదించగా, లైజనింగ్ ఆఫీసర్‌గా మోహన్‌రెడ్డి వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment