రాష్ట్ర స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఆసక్తి ఉన్న వారు గుంటూరు క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీల్లో పాల్గొనాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అండర్ 14, 16, 18 బాల, బాలికలు, పురుషులు, మహిళలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. సొంత సైకిల్‌తో పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీలు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం గుద్రోల్ పాఠశాలలో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఇతర వివరాలకు 98493 79932, 97080 92077ను సంప్రదించాలని ఆయన కోరారు.
రేపు జిల్లాలో దివ్యాంగులకు క్రీడాపోటీలు
జిల్లా కేంద్రంలోని కణ్ణన్ పాఠశాల ఆవరణలో ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆసక్తి ఉన్న దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన వెల్లడించారు.
వచ్చే నెలలో సీఎం కుప్పం రాక
కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ మూడో వారంలో కుప్పంలో పర్యటించనున్నట్లు కడా పీడీ వికాస్ మర్మత్ అన్నారు. నియోజకవర్గ స్థాయి అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం పైలెట్ ప్రాజెక్టు కింద సోలార్ విద్యుత్ సరఫరా చేసేందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే సర్వే పూర్తి చేసినట్లు దీనిపై సంబంధిత అధికారులు దృష్టిలో పెట్టుకుని కృషి చేయాలని సూచించారు. కుప్పం అభివృద్ధిపై ఇప్పటికి తయారు చేసినా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధం కావాలని పేర్కొన్నారు.
వివరణ ఇవ్వండి
చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ మాజీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి(రిటైర్డ్)పై వచ్చిన ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ గురువారం ఉత్త ర్వులు జారీ చేశారు. ప్రభాకర్‌రెడ్డిపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ గీర్వాణీచంద్రప్రకాష్ ఫిర్యాదు చేశారు. దీనిపై విరమణ పొందే మూడు రోజుల ముందు ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై ఆయన కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు తాజాగా ఆయనపై అభియోగాలు మోపుతూ జీవోలు 677, 63 విడుదల చేశారు. ఈ అభియోగాలపై ప్రభాకర్‌రెడ్డి 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని, తదుపరి ఆయన 10 రోజుల్లోపు లిఖిత పూర్వకంగా అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
నేడు త్రోబాల్ పోటీలు
కాణిపాకం: రాష్ట్ర స్థాయి ఎజ్‌జీఎఫ్ త్రోబాల్ పోటీలను శుక్ర, శనివారాల్లో పూతలపట్టులో నిర్వహించనున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి వసంతవాణి తెలిపారు. పూతలపట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 13 జిల్లాల బాలబాలికలు హాజరవుతారని, ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ సుమిత్‌కుమార్ చేతుల మీదుగా పోటీలు ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు.
డీఎస్పీల బాధ్యతల స్వీకరణ
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ) డీఎస్పీగా జె.రాంబా బు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయనతోపాటు 8వ బెటాలియన్ డీఎస్పీ లుగా జీవీ కృష్ణారావు, ఎస్‌కే సైదా సైతం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న వీరికి చిత్తూరులో పోస్టింగ్ ఇచ్చారు. వీరు ముగ్గురూ వేర్వేరుగా ఎస్పీ మణికంఠను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఇళ్లను పూర్తి చేయించండి
గంగాధర నెల్లూరు: మండలంలోని జగనన్న కాలనీ లేఔట్‌లో అసంపూర్తితో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తిచేయాలని హౌసింగ్ పీడీ పద్మనాభం ఆదేశించారు. మండలంలోని కోటాగరం పంచాయతీ ఒడ్డుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను హౌసింగ్ పీడీ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లను ఇదివరకే 100 రోజుల్లో పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ శ్రీధర్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు గీత, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment