సాగునీటి సంఘాలకు ఎన్నికలు
● జిల్లావ్యాప్తంగా 14వ తేదీన ఎన్నికలు ● నోటిఫికేషన్ జారీ ● ఏకగ్రీవం కాని చోట రహస్య ఓటింగ్ ● మొదటిసారి బ్యాలెట్ పేపర్ విధానంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ● ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
జిల్లావ్యాప్తంగా సాగునీటి వినియోగదారుల ఎన్నికల సందడి మొదలైంది. కలెక్టరేట్, అధికారులు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ మేరకు ఈ నెల 14వ తేదీన జిల్లావ్యాప్తంగా
సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టరేట్, ఇరిగేషన్ అధికారులు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ) ఎన్నికల నిర్వహణకు సమయం ఆసన్నమైంది. కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ పర్యవేక్షణలో జిల్లావ్యాప్తంగా 220 నీటి సంఘాలకు ఈ నెల 14వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే మొదటిసారి సాగునీటి సంఘాల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నారు. జిల్లాలోని 32 మండలాల్లో సంఘాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో ప్రదర్శించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది ఏర్పాటుకు అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల పర్యవేక్షణ అధికారి డీఆర్‌ఓ మోహన్‌కుమార్ బుధవారం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ముందు సర్వసభ్య సమావేశం..
జిల్లావ్యాప్తంగా 220 నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి గెలుపొందే వారితో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. జిల్లాలో 215 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఉండగా, వాటి పరిధిలో ఐదు మీడియం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కమిటీ సంఘాలు ఉన్నాయి. వాటితో కలిపి మొత్తం 220 సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సంఘాల పరిధిలో 36,258 మంది పురుషులు, 12,772 మహిళలు మొత్తం 49,030 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పాఠశాలలే పోలింగ్ కేంద్రాలు..
జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో ప్రభుత్వ స్కూళ్లను పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 1,357 పోలింగ్ కేంద్రాలకు 220 మంది ఎన్నికల అధికారులు, 152 అసిస్టెంట్ ఎన్నికల అధికారులు, 1357 మంది పీఓలు, 1357 మంది ఏపీఓలను ఎన్నికల విధులకు కేటాయిస్తున్నారు. అదేవిధంగా ఒక పోలింగ్ కేంద్రంలో ఇద్దరు పోలీసుల చొప్పున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
కార్వేటి నగరం మండలంలోని కృష్ణాపురం ప్రాజెక్టు
పకడ్బందీగా ఏర్పాట్లు
జిల్లాలో 14న జరిగే సాగునీటి సంఘాల ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ నెల 13వ తేదీన జిల్లా ఇరిగేషన్ కార్యాలయం నుంచి ఆయా మండలాలకు ఎన్నికల సామగ్రిని ప్రత్యేక వాహనాల్లో 32 మండలాలకు తరలించడం జరుగుతుంది.
– సుమిత్ కుమార్ గాంధీ,
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, చిత్తూరు
జిల్లా సాగునీటి సంఘాల ఎన్నికల సమాచారం
ఎన్నికలు జరిగే సాగునీటి సంఘాలు 220
మైనర్ ఇరిగేషన్ చెరువులు 215
మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు
(కృష్ణాపురం) 05
పురుష ఓటర్లు 36,258
మహిళా ఓటర్లు 12,772
మొత్తం ఓటర్లు 49,030
గ్రామాల్లో దండోరా..
సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో దండోరా వేయించాలని ఆదేశించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి ఏర్పాట్లను ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని పర్యవేక్షిస్తున్నాం. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల కోసం అవసరమైన సిబ్బంది నియామకాలు పూర్తి చేశాం. విధులు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించాం.
– మోహన్‌కుమార్,
జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి, డీఆర్‌ఓ
రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నికలు
సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరగని సందర్భాల్లో చేతులెత్తి ఎన్నుకునే విధానాన్ని అనుసరిస్తే ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అభ్యర్థులకు తెలిసిపోతుంది. అందువల్ల వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ (ఎన్నికల నిర్వహణ) రూల్స్, 118 ప్రకారం చేతులెత్తే పద్ధతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. అందువల్ల ఏకాభిప్రాయం కుదరని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటామనే రైతులను.. అందుకు అనుమతించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయాలను ఇటీవల జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు. అలాగే ఓటర్లందరికీ 14వ తేదీన ఓటర్ స్లిప్పులు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment