సర్వేలోనూ చిన్నచూపేనా..!
సంచార జాతుల వారిని గుర్తించేందుకు చేపట్టిన సీడ్ సర్వేలోనూ సిబ్బంది చిన్నచూపు చూశారు. వారికి ప్రభుత్వం నుంచి సాయం అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన లక్ష్యం నీరుగారుతోంది.
క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది సంచార జాతుల వారు లేని చోటకు వెళ్లి మీరు సంచార జాతుల వారు కాదు కదా అంటూ నమోదు చేసుకున్నారు. ఆపై మొత్తంగా అసలు సంచార తెగల వారు లేరని నివేదిక ఇచ్చారు. ఎంపీడీఓలు ఈ
సీడ్ సర్వేపై దృష్టి సారించకపోవడం వల్లే ప్రభుత్వ ఆశయం పక్కదారి పట్టింది. దీనిపై బీసీ, ఎంబీసీ సంఘాల నేతల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో మరోమారు సీడ్ సర్వే చేయాలని బీసీ
కార్పొరేషన్ ఈడీ, కలెక్టర్ ఆదేశించారు.
పలమనేరు: వెనుకబడిన తరగతుల్లోని అట్టడుగున ఉన్న సంచార, విముక్తి జాతులకు చెందిన వారికి జీవనోపాధి కల్పనతో పాటు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ (సీడ్) (సంచార జాతుల ఆర్థిక సాధికారిత పథకం) సంచార జాతుల సర్వేని చేపట్టాలని ఆదేశించింది. అందులో వారి సమగ్రమైన వివరాలను అందించాలని తెలిపింది. కానీ సర్వే చేస్తున్న సచివాలయాల సిబ్బంది మాత్రం అసలు ఆయా మండలాల్లో సంచార జాతులే లేరని తప్పుడు సర్వే నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో జిల్లాలోని సంచార జాతులకు ప్రభుత్వం ద్వారా జరిగే మేలు కూడా జరగకుండా పోతోంది.
నీరుగారిపోతున్న లక్ష్యం..
రాష్ట్రంలో 42 సంచార, విముక్తి జాతులు ఉన్నట్టు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఇందులో బీసీ–ఏ జాబితాలో 36 కులాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని క్షేత్రస్థాయిలో గుర్తించి వారి వాస్తవ పరిస్థితులు, వారు ఏమి కోరుకుంటున్నారు ? వారు బాగుపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. తద్వారా వీరికి ఉపాధి కల్పన, వీరి పిల్లలకు చదువు, వారు చేస్తున్న వ్యాపారాలకు 50 శాతం సబ్సిడీతో జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ది సంస్థ(ఎన్‌బీసీఎఫ్‌డీసీ) ద్వారా రుణాలను అందించి వారు ఆర్థికంగా బాగుపడేలా చేయాలనేది ముఖ్య లక్ష్యం
కులం పేరిట అవమానాలు..
ఈ ప్రాంతంలోని సంచార తెగలు, కులాలపై సమాజంలో చిన్నచూపు ఉంది. వారు మనలాంటి మనుషులే కదా అని సమాజం భావించడం లేదు. వారిని సమాజం అమర్యాదగా చూస్తుండడంతో వారు కులం పేరు చెప్పుకోవడానికి సైతం నామోషీగా భావిస్తున్నారు. వీరి పిల్లలు అక్కడక్కడా స్కూళ్లలో చేరినా తోటివారు వారిని గేళి చేస్తున్నారు. మీరు పాములు పట్టేవారు కదా.. గంగిరెద్దులను ఆడిస్తారా ? ఎలుకలను తింటారా..! అంటూ తోటి పిల్లల వేధింపులతో 30శాతం మంది పిల్లలు ప్రాథమిక విద్యకు సైతం దూరమవుతున్నారు.
ఆపై కార్మికులు, కూలీలుగా మారుతున్నారు. టీచర్లు సైతం వారిని హేళన చేస్తున్నట్టు తెలుస్తోంది. వారి తల్లిదండ్రుల వృత్తి, అలవాట్లు, కనీసం కులధ్రువీకరణ పత్రాలు కూడా లేక చదువుకోవాలనే ఆశ ఉన్నా వారిని తల్లిదండ్రులు బడికి పంపడం లేదు.
అసలు సంచార జాతులంటే ..!
సంచార కులాలంటే వీరు ఓ చోట శాశ్వతంగా ఉండరు అని అర్థం. కొంతకాలం ఓ చోట మళ్లీ ఎక్కడో జీవనం సాగిస్తుంటారు. గ్రామాలకు దూరంగా గుడారాలు వేసుకుని కొన్నాళ్లు ఉండి మరో ప్రాంతానికి వెళ్లిపోతుంటారు. జిల్లాలోని పలమనేరు, కుప్పం ప్రాంతంలో ఇలాంటి వారు ఎక్కువగా ఉంటున్నారు. గ్రామాల్లో పక్కపిన్నులు, బెలూన్లు, ఎలుక మందులు, కొరడాలతో కొట్టుకునేవాళ్లు, వెంట్రుకలు కొనుగోలు చేసేవారు, పాములు ఆడిపించేవారు కనిపిస్తున్నారు.
1.20 లక్షలమంది సంచార జాతుల వాసులు
జిల్లాలో 90 వేలమంది సంచార జాతులు, తెగలు, బీసీ ఏ కేటగిరి నుంచి మారిన మరో 30 వేల మంది మొత్తం 1.20 లక్షల మంది ఇక్కడ సంచార జాతుల జాబితాలో ఉన్నారనేది బీసీ సంక్షేమశాఖ రిపోర్టు. కానీ ఇటీవల చేపట్టిన సీడ్ సర్వే చేసిన సచివాలయ ఉద్యోగులు 10 మండలాల్లో అసలు ఇలాంటి సంచార జాతులే లేరంటూ నివేదికలు పంపారు. సంబంధిత ఎంపీడీఓల పర్యవేక్షణ లేకనే ఈ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా అందించిన సర్వేలో పెనుమూరులో 23 మంది, వెదురుకుప్పంలో 86 మంది, చౌడేపల్లిలో 160 మంది, పెద్దపంజాణిలో 18 మంది మాత్రమే ఉన్నట్టు నివేదించారు. ఇక పలమనేరు, బైరెడ్డిపల్లి, వీకోట, గంగవరం, శాంతీపురం, రామకుప్పం, నగరి తదితర మండలాల్లో అసలు ఇలాంటి వారేలేరనే రిపోర్టు ఇచ్చారు. సగానికి పైగా మండలాల్లో అసలు సీడ్ సర్వే ఇంకా మొదలు కాలేదు. దీనిపై మండిపడిన బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, కలెక్టర్ సుమిత్‌కుమార్ మళ్లీ సమగ్రంగా సర్వే చేయించాలని, ఆ నివేదికలను సంబంధిత ఎంపీడీఓలకు పంపారు.
తూతూమంత్రంగా సంచారజాతుల సర్వే
స్కూళ్లలో తోటి విద్యార్థులు గేలి చేస్తుండడంతో
కూలీలుగా మారుతున్న సంచార జాతుల పిల్లలు
అటువైపు వెళ్లకుండానే ఎవరూ లేరని నివేదిక
బీసీ, ఎంబీసీ సంఘాల నేతల ఆగ్రహం
సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యపు సర్వే
మరోమారు సర్వే చేయాలని బీసీ కార్పొరేషన్ ఈడీ, కలెక్టర్ ఆదేశాలు
ఇప్పుడైనా కచ్చితమైన సర్వే చేస్తారా..!
సచివాలయాల పరిధిలో ఇప్పటికై నా సంచార జాతులను కచ్చితంగా గుర్తించి, పటిష్టంగా సర్వే నిర్వహించేలా ఎంపీడీఓలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై కలెక్టర్ దృష్టి సారించాల్సింది ఉంది. మరోవైపు రాష్ట్ర ఎంబీసీ నాయకులు రవి పూసల ఈ విషయాన్ని జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment