యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
● పగలూ, రాత్రి తేడా లేకుండా తెల్లబంగారం తరలింపు ● గ్రామాల్లో డంప్ చేసి.. చీకటి పడగానే తమిళనాడుకు తరలిస్తున్న వైనం ● అక్రమార్కులకు సహకరిస్తున్న పోలీసులు ● నంబరు ప్లేట్లు లేని ట్రాక్టర్లలో మైనర్లచే సరిహద్దులు దాటిస్తున్న అక్రమార్కులు
విజయపురం : మండల కేంద్రం విజయపురంతో పాటు తమిళనాడుకు చెందిన గ్రామాలకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. సంబంధిత అధికారులు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. అక్రమార్కులు అదును చూసి ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తూ రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు సరిహద్దులో ఉన్న మహరాజపురం, శ్రీహరిపురం, మల్లారెడ్డికండ్రిగ, ఇల్లత్తూరు, కేవీశ్రీరాపురంలో అక్రమార్కులు ఇసుకను డంప్ చేసి రాత్రి పూట తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం.
నంబరు ప్లేటు లేని వాహనాల్లో..
మండల కేంద్రంలో తిరిగే చాలా ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు లేవు. గుట్టు చప్పుడు కాకుండా నంబరు ప్లేటు లేని ట్రాక్టర్లలో మండల సరిహద్దును దాటుకుని తమిళనాడుకు రోజూ ఇసుకను తరలించేస్తున్నారు. అంతేకాకుండా ఈ నంబరు ప్లేట్లు లేని ఇసుక ట్రాక్టర్లను ఎక్కువగా మైనర్లే నడుపుతుండడం విశేషం. వీరు అతివేగంగా నడపడం వల్ల ఇతర వాహనదారులు, గ్రామీణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓవర్ స్పీడ్‌తో వస్తున్న ఇసుక ట్రాక్టర్లను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ట్రాక్టర్లను యథేచ్ఛగా మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి ఇసుక వాహనాలను స్వాధీనం చేసుకుని నామమాత్రపు జరిమానాలు విధిస్తూ వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment