ఎడతెరపి లేని వాన
● జిల్లాలో 996.5 మి.మీ వర్షపాతం నమోదు ● పలు మండలాల్లో అధికంగా వరి పంటకు నష్టం
● ఉప్పొంగిన వాగులు, వంకలు, కుంటలు ● టమాట రైతులకు మరింత నష్టం
● అత్యధికంగా పాలసముద్రంలో, అత్యల్పంగా గుడుపల్లిలో నమోదు
చిత్తూరు కలెక్టరేట్ : ఇటీవలే ఫెంగల్ తుపాన్ జిల్లాపై ప్రభావం చూపగా.. మరోసారి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. అధిక వర్షాల కారణంగా జిల్లాలోని స్కూళ్లు, కళాశాలలు, అంగన్‌వాడీ సెంటర్లకు సైతం ఇన్‌చార్జ్ కలెక్టర్ విద్యాధరి ఉదయమే సెలవును ప్రకటించారు.
తడసి ముద్దయిన జిల్లా..
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లా తడిసి ముద్దయింది. జిల్లాలోని నగరి, పాలసముద్రం, నిండ్ర, కార్వేటినగరం మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు పారడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాలకు పలమనేరు, నగరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో అధికంగా వరి పంట దెబ్బతింది. ఇప్పటికే రేట్లు లేక ఇబ్బంది పడుతున్న టమాట రైతులకు ఈ వాన మరింత నష్టం కలిగిస్తోందని పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో పంట సాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముసురు వర్షంతో జనజీవనం స్తంభించింది. చిత్తూరు నగరంలోని తేనెబండ, సంతపేట, గిరింపేట ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్ల మధ్య నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.
జిల్లావ్యాప్తంగా 996.5 మి.మీ
వర్షపాతం నమోదు
జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం 6 గంటల వరకు సేకరించిన వర్షపాతం వివరాల ప్రకారం జిల్లా మొత్తంగా 996.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలసముద్రంలో 93.0 వర్షం కురిసింది. అత్యల్పంగా గుడుపల్లిలో 11.0 మి.మీ వర్షపాతం నమోదైంది. విజయపురం, యాదమరి, వెదురుకుప్పం, ఐరాల మండలాల్లో వర్షపాతమే నమోదు కాలేదు. సగటున 31.1 మి.మీ వర్షపాతం నమోదైంది. పులిచెర్లలో 62.2, గంగాధరనెల్లూరులో 55.5, కార్వేటినగరంలో 55.3, ఎస్‌ఆర్‌పురంలో 54.0, పెనుమూరులో 49.7, సదుంలో 49.5, నగరిలో 46.5, తవణంపల్లిలో 44.5, గుడిపాలలో 39.8, చిత్తూరులో 39.5, చిత్తూరు రూరల్‌లో 39.5, సోమలలో 34.8, పూతలపట్టులో 33.0, నిండ్రలో 32.8, చౌడేపల్లిలో 31.5, బంగారుపాళ్యంలో 28.8, పలమనేరులో 26.5, రొంపిచెర్లలో 24.8, పెద్దపంజాణిలో 24.5, గంగవరంలో 22.0, బైరెడ్డిపల్లిలో 19.0, పుంగనూరులో 18.0, శాంతిపురం, రామకుప్పంలో 16.2, కుప్పంలో 14.7, వి.కోటలో 14.0, గుడుపల్లెలో 11.0 మి.మీ వర్షపాతం నమోదైంది.
కుంగిన పాదిరేడు పెద్దచెరువు కట్ట
వడమాలపేట (విజయపురం) : వడమాలపేటలోని పాదిరేడు పెద్ద చెరువు కట్ట స్వల్పంగా కుంగింది. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్‌ప్రసాద్, డీఈ శ్రీనివాసులు, తహసీల్దార్ జరీనా గురువారం చెరువు కట్టను పరిశీలించారు. కుంగిన కట్ట వద్ద మరమ్మతు పనులు చేపట్టారు. కలుజును మరింత లోతుగా తవ్వి నీటిని దిగువకు వదిలిపెట్టారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి చెరువు కట్ట స్వల్పంగా కుంగిందని అధికారులు తెలిపారు.
నీట మునిగిన కారు
వడమాలపేట (విజయపురం ) : వడమాలపేట మండలం పూడి పంచాయతీ వేమాపురంలో గురువారం సాయంత్రం రైల్వే అండర్ బ్రిడ్జి కింద కారు వర్షపు నీటిలో మునిగిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే కారును నిలపడంతో అందులో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయట పడ్డారు. వడమాలపేట నుంచి అప్పలాయగుంటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో వేమాపురం రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు స్పందించి మోటార్ సాయంతో వర్షపు నీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment