అటవీశాఖ.. అక్రమాల ఇలాకా
● ఇప్పటికే ఎన్‌హెచ్ ఇచ్చిన రూ.27 లక్షల పరిహారం స్వాహా ? ● చెట్ల కటింగ్, రవాణాకు డిపార్ట్‌మెంట్ ఇచ్చిన రూ.17 లక్షలు హాంఫట్ ● సోషల్ ఫారెస్ట్‌లో చెట్లకు పాదులు చేయకుండానే రూ.4 లక్షలు మాయం ● పలమనేరు అటవీశాఖలో తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు ● ఇక్కడి నుంచి బదిలీపై వైఎస్సార్ కడప జిల్లాకు వెళ్లిన ఓ అధికారి అక్రమాలు ● నిధుల దుర్వినియోగంపై కొనసాగుతున్న విచారణ
పలమనేరు: పలమనేరు అటవీశాఖలో గతంలో ఇక్కడ పనిచేసి కడప జిల్లాకు బదిలీ అయిన ఓ అధికారి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం అడవిలోని వృక్షాలకు సంబంధించి రూ.27 లక్షల దాకా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై డీఎఫ్‌ఓ భరణి విచారణ చేపట్టారు. ఇదేకాకుండా డిపార్ట్‌మెంటల్ ఎక్స్‌టెన్షన్ పనులు, సామాజిక వనాల పెంపకంలో చెట్లకు పాదులు చేయకుండానే.. చేసినట్టు బిల్లులు పెట్టి ఆ డబ్బులు కూడా స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అవినీతి బాగోతాలపై కొనసాగుతున్న విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం కనిపిస్తోంది.
కొట్టిన చెట్లు ఏమయ్యాయో..!
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆ శాఖ అధికారులు చెల్లించిన నష్టపరిహారంతో పాటు హైవేలోని వృక్షాలను నరికించడం, వాటి రవాణా కోసం డిపార్ట్‌మెంటల్ ఎక్స్‌ట్రాక్షన్ పేరిట అటవీశాఖ అంచనాలను తయారు చేసి ఇందుకోసం రూ.17 లక్షలను మంజూరుచేసింది. ఈ డబ్బు ఏమైందో తెలియని పరిస్థితి. ఇంతేకాక అసలు డిపార్ట్‌మెంట్ కొట్టించిన చెట్లు ఎన్ని ? అవి ఎక్కడున్నాయి ? అనే లెక్క కూడా లేకుండా పోయింది. దీంతోపాటే ఎక్స్‌ప్రెస్ హైవే పేరిట తొలగించిన చెట్ల ముసుగులో అడవిలోని విలువైన వృక్షాలను సైతం కొట్టి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మరో రూ.4 లక్షలు కాజేసి..
పలమనేరు ఫారెస్ట్ రేంజి పరిధిలో పలు సోషల్ ఫారెస్ట్ వనాలు ఉన్నాయి. వీటిని బలహీనమైన అటవీప్రాంతంలో వనాల అభివృద్ధి ద్వారా పెంచుతున్నారు. ఆ మేరకు గంగవరం మండలంలోని బూడిదపల్లి, గాంధీనగర్ బీట్లలో ఎర్రచందనం, టేకు, తంగేడు లాంటి మొక్కలను పెంచారు. వీటికి ఏటా పాదులు చేసే కార్యక్రమాన్ని అటవీశాఖ చేపడుతోంది. ఈ క్రమంలో తాను బదిలీ అయినట్లు తెలుసుకున్న ఆ అధికారి అక్కడి రెండు బీట్లలో చెట్లకు పాదులు చేయకనే చేసినట్లు సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి రూ.4 లక్షల దాకా బిల్లులు చేసి స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ జరిగిన అక్రమాలపై డిపార్ట్‌మెంట్ విచారణ చేస్తున్నామని అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ భరణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment