రూ.8.80 లక్షల రికవరీకి ఆదేశాలు
శాంతిపురం: మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,80,211 దుర్వినియోగం జరిగినట్టు సామాజిక తనిఖీ అధికారులు గుర్తించారు. మొత్తం రూ.8.76 కోట్లతో జరిగిన 1,384 పనులకు సంబంధించి గత 22 నుంచి ఈ నెల 4 వరకు తనిఖీ బృందం పరిశీలించింది. అందులో లోపాలను గుర్తించి బాధ్యులైన నాటి ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ సిబ్బంది నుంచి రికవరీకి గురువారం జరిగిన ప్రజా వేదికలో సిఫార్సు చేసింది. కార్యక్రమంలో అడిషనల్ పీడీ మల్లికార్జున్, ఏపీడీ వెంటకరత్నం, ఎంపీడీఓ కుమార్, ఏపీఓ హరి, తనిఖీ సిబ్బంది పాల్గొన్నారు.
పంట పొలాలపై ఏనుగుల దాడులు
బైరెడ్డిపల్లె: మండలంలోని వెంగంవారిపల్లె, కడతట్లపల్లె గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వ్యవసాయ పంట పొలాలపై బుధవారం రాత్రి ఏనుగుల గుంపు దాడులు చేయడంతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంగంవారిపల్లెకు చెందిన రవిచంద్ర సాగు చేసిన అరటి, మామిడి మొక్కలను ధ్వంసం చేశాయి. కడతట్లపల్లెకు చెందిన శ్రీరాములు సాగు చేసిన బంగాళదుంప పంటను తొక్కి నాశనం చేశాయి. కోత దశలో ఉన్న పంటలను నాశనం చేయడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. గురువారం ఉదయం అటవీశాఖ సిబ్బంది పంటలను పరిశీలించారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పురుగు మందులు ఆఖరి అస్త్రంగా వాడాలి
పుత్తూరు : మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు సాగులో నూతన శాస్త్ర పరిజ్ఙానాన్ని అందించాలని జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం ట్రైనింగ్ కోఆర్డినేటర్ భాస్కరయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో పుత్తూరు, సత్యవేడు వ్యవసాయ డివిజన్‌లలో పనిచేస్తున్న రైతు సేవా కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా భాస్కరయ్య మాట్లాడుతూ.. తెగుళ్ల నివారణ మందులు, సేంద్రియ ఎరువుల వినియోగానికి డ్రోన్లను వినియోగంతో ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. పంటల సాగులో రసాయన ఎరువులు, మందులు ఆఖరి అస్త్రంగానే వాడాలన్నారు. ఏఓ వేణుగోపాలరావు రబీ వరిలో మేలైన వంగడాలు, ఎరువుల వాడకం, చీడ పీడల నివారణ గురించి వివరించారు. రాస్ కృషి విజ్ఙాన కేంద్రం, ఉద్యానవన శాస్త్రవేత్త సుధాకర్ పూల సాగులో నులి పురుగులు, మల్లె తోటలను నష్ట పరుస్తున్న పూమొగ్గ తొలిచే పురుగు, ఎర్రనల్లి నివారణ గురించి వివరించారు. డీటీసీ భాస్కరయ్య భూసార పరీక్షలు, ఫలితాల గురించి వివరించారు. కార్యక్రమంలో పుత్తూరు, సత్యవేడు ఏడీఏలు రమేష్‌రాజు, సుబ్రహ్మణ్యం, ఏఓలు విజయ్‌కుమార్, హరిత, శోభ, రమేష్, సంజీవరెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన పిల్లలు
– అమ్మమ్మను చూద్దామని బెంగళూరుకు సైకిల్‌పై వెళ్లిన పిల్లలు
– సామాజిక మాధ్యమాల్లో వైరల్ – గుర్తించిన కోలార్ వాసులు
పలమనేరు: మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరుకు చెందిన ఇర్షాద్ కుమారులు హుస్సేన్, రోషన్ మదర్సాలో చదువుకుంటూ బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆ పిల్లల ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్‌గా మారింది. ఇలా ఉండగా ఇద్దరు పిల్లలు గురువారం కోలారు వద్ద సైకిల్‌పై వెళ్తుండగా అక్కడి వారు వీరిని గుర్తించారు. వారిని విచారించగా తాము పలమనేరు నుంచి వస్తున్నామని చెప్పడంతో వారిని అక్కడే ఉంచుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వెళ్లి పిల్లలను ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకు వెళ్లారని పిల్లలను అడగ్గా.. తాము బెంగళూరులోని అమ్మమ్మను చూసేందుకు వెళ్లామని చెప్పారు. ఎట్టకేలకు పిల్లలు సురక్షితంగా ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రులు ఆనందపడ్డారు.
గుర్తు తెలియని శవం లభ్యం
గంగాధర నెల్లూరు: మండలంలోని మంగినాయనికుప్పం బస్టాప్ దగ్గరలో రోడ్డు కల్వర్టు కింద గుర్తుతెలియని శవం బయటపడింది. జీడీ నెల్లూరు సీఐ శ్రీనివాసంతి కథనం మేరకు వివరాలు.. గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం ప్రధాన రహదారి పక్కన మంగినాయనికుప్పం బస్టాప్ దగ్గరలో ఉన్న రోడ్డు కల్వర్టు కింద గుర్తు తెలియని వ్యక్తి శవం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. సీఐ ఘటనా స్థలికి చేరుకుని శవాన్ని వెలికి తీయించి, మృతి చెందిన వ్యక్తికి 40 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment