వదిలేస్తే వెళ్లిపోతాం మహాప్రభో! | - | Sakshi
Sakshi News home page

వదిలేస్తే వెళ్లిపోతాం మహాప్రభో!

Published Fri, Dec 13 2024 1:49 AM | Last Updated on Fri, Dec 13 2024 1:49 AM

వదిలేస్తే వెళ్లిపోతాం మహాప్రభో!

వదిలేస్తే వెళ్లిపోతాం మహాప్రభో!

సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు పని చేయడానికి భయపడుతున్నారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో అధికారులు నలిగిపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలు తమకు నచ్చిన అధికారులను కుప్పానికి తెచ్చుకున్నారు. కానీ ప్రతి పనిలో వారి జోక్యం పెరగడంతో అధికారులు తట్టుకోలేకపోతున్నారు. కొందరు అధికారులు చట్టాలను పక్కన పెట్టి పచ్చ పార్టీ నేతల ఆదేశాలను పాటించినా.. అవసరం తీరాక అవమానకర రీతిలో వారిపై వేటు తప్పడం లేదు.

కుప్పం/శాంతిపురం: ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా చట్టాలకు లోబడి పనిచేస్తారు. కానీ కుప్పంలో మాత్రం పూర్తిగా పచ్చనేతల కనుసన్నల్లో, వారి ఆదేశాల మేరకు మాత్రమే పనిచేయాలని హుకూం జారీ చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ పట్ల కాస్త ఎక్కువ అభిమానం ఉన్న కొందరు మినహా.. మిగతా అధికారులు నేతల ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నారు. నేతల దగ్గర నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు కూడా అందరూ అడ్డగోలుగా ఆదేశాలు జారీ చేస్తూ.. పెత్తనం చెలాయిస్తుండడంతో నిజాయిపరులైన అధికారులు సహించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఎలాగోలా కుప్పం నియోజకవర్గం నుంచి బయట పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి స్థానాల్లోకి రావడానికి వచ్చేవారు ఎవరూ లేకపోవడంతో దినదిన గండంగా ఉద్యోగాలు చేస్తున్నారు.

ఒత్తిడి తట్టుకోలేక సతమతం..

సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా ముద్ర పడిన ఓ విద్యాసంస్థల అధినేత విపక్ష పార్టీ కౌన్సిలర్‌కు చెందిన స్కూల్‌ను లక్ష్యంగా చేసుకుని నోటీసులు ఇవ్వాలని కుప్పం మండల విద్యాశాఖ అధికారిపై ఒత్తిడి చేశారు. దీంతో సదరు అధికారి ఒత్తిడి తట్టుకోలేక తనను బాధ్యతల నుంచి తప్పించాలని వేడుకుంటున్నారు. మున్సిపాలిటీలోని ఓ కీలక అధికారి తాను సీఎం మనిషిగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఆయనకు టీడీపీ కౌన్సిలర్లు, ఇటీవల టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఒకే పనిపై కీలక నేతల నుంచి వేర్వేరు సిఫార్సులు చేయింస్తుండడం సదరు అధికారిని ఇరకాటంలో పడేస్తోంది.

మేము చేయలేం..

చట్టవిరుద్ధంగా తాను పని చేయలేనని శాంతిపురం మండలంలో ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులో జనం ముందే ఓ అధికారి తేల్చి చెప్పాడు. అలాగైతే తనను బదిలీ చేసి కావాల్సిన వారిని తెచ్చుకోవాలని సూచించాడు. రామకుప్పంలో అసైన్డ్‌ భూములకు పట్టాల జారీపై నాయకుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో సంబంధిత అధికారి ససేమిరా అన్నారు. ఇలాగే ఉంటే తాను సెలవులో వెళ్లిపోతానని హెచ్చరించినట్టు సమాచారం. గుడుపల్లి మండలంలో జెడ్పీ నిధులతో అభివృద్ధి పనుల కోసం విపక్షానికి చెందిన జెడ్పీటీసీకి ప్రతిపాదనలు ఇచ్చినందుకు ఓ అధికారిపై బదిలీ వేటు వేశారు.

కుప్పంలో పని చేసేందుకు భయపడుతున్న అధికారులు

ఇటీవల ఫాంహౌస్‌ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ ఆ ముగ్గురు నేతలు

ప్రతి పనిలో మితిమీరిన తమ్ముళ్ల పెత్తనం

మహిళా అధికారులకూ తప్పని కష్టాలు

పచ్చ నేతల అడుగులకు మడుగులొత్తినా.. చివరికి అవమానాలే..

చట్ట పరిధిని దాటి పని చేసేందుకు ససేమిరా అంటున్న నిజాయితీపరులు

బయట పడేందుకు అధికారుల ఆపసోపాలు

మా మాటే ఫైనల్‌..

కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు, మున్సిపాలిటీకి చెందిన దాదాపు 60 మంది అధికారులతో ముగ్గురు టీడీపీ కీలక నాయకులు ఇటీవల ఫాం హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో తాము చెప్పిందే ఫైనల్‌ అని తేల్చి చెప్పారు. దీంతో ఇక నుంచి తమపై ఒత్తిళ్లు ఉండవని అధికారులు సంబరపడ్డారు. కానీ కింది స్థాయిలో నాయకులు, కార్యకర్తల కర్ర పెత్తనం యథావిధిగా కొనసాగుతుండడంతో అంతా తమ ఖర్మ అని కొందరు అధికారులు సర్దుకుపోతున్నారు.

అన్నీ చేసినా చివరికి వేటే..

కుప్పం డివిజన్‌లో ఓ కీలక పోలీసు అధికారి రాజ్యాంగంలోని చట్టాల కంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదేశాల మేరకే పని చేశారనే విమర్శలు మూటగట్టుకున్నాడు. పచ్చనేతల కళ్లలో ఆనందం కోసం అడ్డగోలుగా కేసులు నమోదు చేసి తమ పార్టీ నేతలు, కార్యకర్తలను హింసించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. అయితే సదరు అధికారి టీడీపీ నాయకుల ఆధిపత్య పోరులో పోకచెక్కగా మారారు. చివరకు అతన్ని అవమానకర రీతిలో మూలన పెట్టారనే చర్చ పోలీసు సిబ్బందిలో సాగుతోంది. అవసరానికి వాడుకుని తమ సారును బలి చేశారని బాహాటంగానే చెబుతున్నారు. గొడ్డు చాకిరీ చేస్తున్నా పనికిరాని వాళ్లతో మాటలు పడాల్సి వస్తోందని, హీనంగా చూస్తున్నారని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మనస్సాక్షిని చంపుకోలేని అధికారులు కుప్పం నుంచి వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

మహిళా అధికారులకూ తప్పని వెతలు

పచ్చనేతల దాష్టీకం నుంచి మహిళా అధికారులకు సైతం ఒత్తిడి తప్పడం లేదు. కుప్పం మండలంలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి దత్తత తీసుకున్న పంచాయతీలో మహిళా సర్పంచుకు సహకరిస్తున్నారనే కారణంతో ఓ మండల స్థాయి మహిళా అధికారిణి ముప్పుతిప్పలు పెడుతున్నారు. అలాగే గుడుపల్లి మండలంలోని అగస్త్య ఫౌండేషన్‌కు రీజనల్‌ స్థాయి అధికారుల రాకపై తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని విద్యా శాఖకు చెందిన మహిళా అధికారిపై నాయకులు బహిరంగంగానే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమకే చివరి నిమిషంలో తెలిసిందని ఆమె చెప్పినా వినిపించుకోకుండా దర్పం ప్రదర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement