శతసంకల్పం
విద్యార్థికి పది తరువాత ఇంటర్ కీలకం.. యవ్వనదశలో అడుగు పెట్టే విద్యార్థి ఇక్కడ పక్కదారి పడుతున్నాడు. విద్యలో వెనుకంజ వేస్తున్నాడు. ఫలితంగా ఏటా ఇంటర్ ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. ఈ స్థితి మార్చాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ తలచింది. ఇందుకు ఓ బృహత్తర ప్రణాళిక రచించింది. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఆ దిశగా అడుగులేస్తోంది. అదే సంకల్ప్ కార్యక్రమం. దీనిపై ప్రత్యేక కథనం.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం సగం కూడా దాటడం లేదు. దీని ప్రభావం ఉత్తీర్ణతపై చూపి ఫలితాల శాతం తగ్గుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖ హాజరు పెంపుపై దృష్టి పెట్టింది. ఈ విద్యాసంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 3,493, ద్వితీయ సంవత్సరం 3,501 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటి నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులు తప్పనిసరిగా కళాశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటోంది. గైర్హాజరవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ డీవీఈఓ సయ్యద్ మౌలా జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
పాఠ్యాంశాల వారీగా..
ఇంటర్మీడియట్ పరీక్షలకు మూడు నెలల సమయం ఉండడంతో ఇంటర్ విద్యాశాఖాధికారులు పాఠ్యాంశాల వారీగా కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నారు. ఈ నెలలో పరీక్షలు నిర్వహించి ప్రతి విద్యార్థి స్థాయిని అంచనా వేయనున్నారు. వెనుకపడిన వారిని, ముందున్న వారితో సమానం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుని రెండో నెలలు అమలు చేయనున్నారు. ఇలా పరీక్షల సమయం వరకు అందరూ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు 2025 మార్చి ఒకటి నుంచి 19వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఉదయం చదువుకునేలా..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను జట్లుగా విభజించి, ఒక్కొక్క జట్టు బాధ్యతలను ఒక్కొక్క అధ్యాపకుడితో అనుసంధానం చేశారు. ఆ జట్టు విద్యార్థులు రోజు కళాశాలకు వచ్చేలా, అన్ని పాఠ్యాంశాల్లో ఉత్తీర్ణత సాధించేలా చేయడం ఆ అధ్యాపకుడిదే బాధ్యత. ఇందులో భాగంగా కళాశాలలోనే కాకుండా ఇంటికి వెళ్లిన తర్వాత చదువుకునేలా, ఉదయం త్వరగా నిద్రలేచేలా చూస్తున్నారు. ఆ సమయంలో చదువుకుంటున్నారా? లేదా అని చరవాణి ద్వారా తెలుసుకుంటున్నారు. స్థానికంగా ఉంటే నివాసాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు.
విద్యార్థులు ఒత్తిడి అధిగమించేలా..
విద్యార్థులు పరీక్షల సమయంలో మానసికంగా ఒత్తిడి గురికాకుండా ఉండడంతో పాటు మత్తుపదార్థాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పనకు ప్రతి కళాశాలలో ఒక అధ్యాపకుడిని కౌన్సిలర్‌గా నియమించారు. విద్యార్థులు అధికంగా ఉంటే మరొకరిని నియమించుకోవచ్చు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను పర్యవేక్షిస్తూ దాని నుంచి వారు బయటపడేలా చూస్తున్నారు.
జిల్లా సమాచారం
ఇంటర్ కళాశాల విద్యార్థులపై
ప్రత్యేక శ్రద్ధ
ప్రత్యేక కార్యాచరణ అమలు
జూనియర్ కళాశాలల్లో సంకల్ప్ అమలు
ప్రతిరోజూ ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహణ
మరిన్ని కార్యక్రమాలు ..
డిసెంబర్ నెలఖారుకు సిలబస్ పూర్తి చేయడంపై ప్రతి కళాశాలను డీవీఈఓ సయ్యద్ మౌలా తనిఖీ చేస్తూ, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు పలు సూచనలు చేస్తున్నారు.
అకాడమిక్ గైడ్స్, మానిటరింగ్ సెల్ ద్వారా కేర్ టేకింగ్ పద్ధతిలో ఒక్కో అధ్యాపకుడికి కొంత మంది విద్యార్థులను అనుసంధానం చేస్తున్నారు. ఆ విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌ల్లో ఉత్తీర్ణత సాధించేలా చేసే బాధ్యత ఆ అధ్యాపకుడిదే.
జూనియర్ ఇంటర్ పరీక్షలు
మార్చి 1 నుంచి 19 తేదీ వరకు
సీనియర్ ఇంటర్ పరీక్షలు
మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 31
మొదటి సంవత్సరం విద్యార్థులు 3,493
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,501
ప్రతి విద్యార్థిపై శ్రద్ధ
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత పెంచాలనే లక్ష్యంతో ఉన్నతాధికారులు సంకల్ప్ అనే కార్యక్రమం అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ప్రతి కళాశాలలో అమలయ్యేలా చర్యలు చేపడుతున్నాం. నిత్యం క్షేత్రస్థాయిలో జూనియర్ కళాశాలలను పర్యవేక్షించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నాను. ప్రభుత్వ కళాశాలల్లో సరైన బోధన, శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణత పెంచేందుకు కృషి చేస్తున్నాం. జేఈఈ, నీట్‌కు కూడా సంకల్ప్ కార్యక్రమంలోనే శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకుని ఉత్తీర్ణులు అయ్యేందుకు చర్యలు చేపడుతున్నాం.
– సయ్యద్ మౌలా,
ఇంటర్మీడియట్ డీవీఈఓ, చిత్తూరు జిల్లా.
సంకల్ప్ కార్యక్రమం అమలు
ప్రతి జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత పెంచేందుకు సంకల్ప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో విద్యార్థులను వారి అభ్యసన సామర్థ్యం, అక్టోబర్‌లో నిర్వహించిన క్వార్టర్లీ పరీక్షల్లో మార్కుల ఆధారంగా 3 కేటగిరీలుగా విభజిస్తారు. మెరుగైన విద్యార్థులను ఏ కేటగిరీ, మధ్యస్థంగా ఉన్న వారిని బీ కేటగిరీ, తక్కువ మార్కులు వచ్చిన వారిని సీ కేటగిరీగా విభజిస్తారు. అర్థ సంవత్సరం పరీక్షలు, ఫ్రీ ఫైనల్స్ పరీక్షల మార్కులను ఆధారంగా వారి కేటగిరీల్లో కూడా మార్పులు చేస్తారు. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment