జీవితంలో శాశ్వతమైన ఒకే ఒక్కటి ఏమిటీ అంటే మార్పు అంటాడు ఓ గ్రీకు తత్త్వవేత్త. వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్, ఏడాది క్రితం అతని చేజిక్కిన ట్విట్టర్ విషయంలో శాశ్వతమైనది ఏమిటంటే, ‘అతి మార్పులు, తరచూ మార్పులు’. సోషల్ మీడియా మెసేజింగ్ వేదిక ట్విట్టర్ పేరును ఎక్స్ డాట్ కామ్‌గా, పిట్ట లోగోను ఎక్స్‌గా జూలై 24న మస్క్ మార్చాక విశ్లేషకుల వ్యాఖ్య ఇది.
ప్రపంచ పటంలోని అనేక చిన్నదేశాల స్థూల జాతీయోత్పత్తి కన్నా ఎక్కువగా, దాదాపు 4400 కోట్ల డాలర్లు పెట్టి ట్విట్టర్‌ను కొన్నప్పటి నుంచి వేల ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్ నిబంధనల్లో మార్పు, ట్వీట్‌లో అక్షరాల పరిమితి పెంపు, ఆ పైన రోజులో ఒక యూజర్ చూసే ట్వీట్ల సంఖ్యపై పరిమితి విధింపు... ఇలా మస్క్ శైలి మార్పులు అనేకం.
గత 16 ఏళ్ళలో జరిగిన మార్పుల కన్నా 6 నెలల్లో మస్క్ చేసిన మార్పులే ఎక్కువ. దానికి కొనసాగింపే ప్రకటించిన 24 గంటల్లోనే ఆచరణలో పెట్టిన తాజా పేరు, రూపు మార్పులు. సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌కు మించి ట్విట్టర్‌ను విస్తరించాలనే వ్యూహం దీని వెనకుందట! కొత్త పేరు, రూపుతో బ్యాంకింగ్, షిప్పింగ్ సహా సమస్తం చేసే విస్తృత వ్యాపారంలో ట్వీట్లు ఇక ఓ చిన్న భాగం మాత్రమేనట! ఇప్పటి దాకా అనేక పరిమితుల మధ్య కూడా ఎంతో కొంత స్వేచ్ఛాస్వరానికి వేదికైన ట్విట్టర్ ఇక మరో ఫక్తు మస్క్ వ్యాపార శాఖగా మారిపోనుంది.
అమెరికా టెక్ వ్యాపారవేత్తలు నలుగురు కలసి చిన్న బృందాల మధ్య సమాచార వినిమయానికి ఎస్‌ఎంఎస్ సేవ అనే ఆలోచనగా మొదలై, ట్విట్టర్ ఇంతటి విశ్వరూపం దాల్చడం అనూహ్యం. పేరు లోని అక్షరాల్లో, లోగోలో అనేక మార్పుల తర్వాత 2006లో పిట్ట బొమ్మ ఆలోచనొచ్చింది. 2010లో ట్రేడ్‌మార్క్ పొంది, 2012లో ఇప్పటి లోగో ఖరారైంది. పదేళ్ళ పైగా లేత నీలం, తెలుపు రంగుల్లో ఈ పాపులర్ వేదిక ప్రపంచ కమ్యూనికేషన్‌లో విడదీయలేని భాగమైంది.
పేర్లను మర్చిపోవచ్చు కానీ, లోగోల్ని మాత్రం మనిషి మెదడు మర్చిపోదన్నది శాస్త్రీయ సత్యం. దాన్ని కూడా మస్క్ పక్కన పెట్టారు. యాపిల్, నైక్ సంస్థల లానే లోగోతోనే ఠక్కున తెలిసిపోతున్న ట్విట్టర్ పేరు, బొమ్మ అన్నీ మార్చడం పైకి అర్థరహితమే! అయితే, అందులోని వ్యాపారతర్కం సదరు పక్కా వ్యాపారికే ఎరుక.
పేరులో ఏముందనేవారికి మస్క్ భిన్నం. వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో తనకు కలిసొస్తుందని నమ్మే ‘ఎక్స్’ అక్షరం ఈ సంస్థ భవితవ్యాన్నీ మలుపు తిప్పుతుందని ఆయన భావన. ఎక్స్ అక్షరంపై ఆయన వ్యామోహం ఇవాళ్టిది కాదు. 1999లోనే ఆయన ఎక్స్ డాట్‌కామ్ పేరిట ఓ ఆన్‌లైన్ బ్యాంక్‌కు సహ వ్యవస్థాపకుడు. అనంతరం ఆ సంస్థే ‘పే పాల్’గా మారింది. మస్క్ తాలూకు రాకెట్ కంపెనీ పేరు ‘స్పేస్ ఎక్స్’.
ఆయన సారథ్యంలోని టెస్లా సంస్థ విడుదల చేసిన తొలి స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ మోడల్ పేరూ ఎక్సే! చివరకు మూడేళ్ళ క్రితం పుట్టిన తన కుమారుడి పేరు కూడా ఎక్స్ అని వచ్చేలా పెట్టారు. అయితే, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది నెలవారీ ఖాతాదార్లున్న ట్విట్టర్ పేరు, లోగో మార్పులకు ప్రాథమిక ప్రతిస్పందన అంత ఆశాజనకంగా లేదు.
ట్విట్టర్ పాపులర్ సంస్కృతిలోనే కాదు భాషలోనూ భాగమైంది. ట్వీట్ చేయడమనేది క్రియా పదమైంది. సమాచారం పంచుకొనేవారు ట్వీపుల్ పేర సర్వనామమయ్యారు. ట్విట్టర్ వచ్చాక జనం వార్తలు చదివే తీరు, స్పందించే తీరు అన్నీ మారిపోయాయి. తీరా మస్క్ వచ్చాక ట్విట్టర్ స్వరూ పమే కాదు... స్వభావమూ మారిపోయింది.
ట్విట్టర్‌ను కొన్నప్పుడు తనంతట తానుగా సందేశాలు పంపే కంప్యూటర్ ప్రోగ్రామైన బోట్ సమస్యను పరిష్కరిస్తాననీ, తిరుగులేని వాక్ స్వాతంత్య్రానికి దీన్ని వేదికగా మారుస్తాననీ మస్క్ మాటిచ్చారు. అవన్నీ నీటి మూటలయ్యాయి. పైపెచ్చు, మస్క్ హయాంలోనే ట్విట్టర్‌లో బోట్స్ సంఖ్య, వాటిలో రకాలు, విషం కక్కే సందేశాలు... అన్నీ పెరిగాయి. అదీ చాలదన్నట్టు మనోడు వచ్చాక ట్విట్టర్‌లో పారదర్శకత తగ్గింది. మీడియాపై ధ్వజమెత్తే మస్క్ అందుకు తగ్గట్టే ట్విట్టర్‌కు జర్నలిస్టులు మెయిల్ చేస్తే జవాబిచ్చే సంప్రదాయానికీ తిలోదకాలిచ్చారు.
ఒకప్పుడు సంపూర్ణ వాక్ స్వాతంత్య్ర వీరుడిననీ, ప్రజాస్వామ్యానికి వాక్ స్వాతంత్య్రమే పునాది అనీ, ట్విట్టరనేది మానవాళి భవితవ్యానికి సంబంధించిన అంశాలను చర్చించే రచ్చబండ అనీ బీరాలు పలికిన మస్క్ తీరా ఏడాది తిరిగేసరికల్లా బోర్డు తిప్పేశారు. ఆ యా దేశాల్లోని చట్టాలను గౌరవించేవాడినని ప్రకటించుకుంటూ, జర్నలిస్టులతో సహా పలువురి ట్విట్టర్ ఖాతాల్ని సస్పెండ్ చేసే స్థితికి వచ్చారు. ఇప్పుడాయన ధ్యేయమల్లా అర్జెంటుగా చేతిలోని పిట్టను ప్రపంచంలో అతి పెద్ద డిజిటల్ ఉత్పత్తుల్లో ఒకటైన చైనా ‘ఉయ్‌ఛాట్’ పద్ధతిలో సమస్త సర్వీసుల యాప్‌గా మార్చేయడం!
మెసేజింగ్, ట్యాక్సీ సేవల ఆర్డరింగ్, డిజిటల్ చెల్లింపులు అన్నీ చేయడానికి వీలుండే ఉయ్ ఛాట్ ఘన విజయానికి చైనాలో మరో పోటీ లేకపోవడమూ ఒక కారణం. అది మర్చిపోయి, వాక్ స్వాతంత్య్రంతో మొదలైన ఓ వేదిక ఇలా వాక్ స్వాతంత్య్రమే లేని నిరంకుశ దేశంలోని అంశాలతో ప్రేరణ పొందే స్థితికి రావడమే విషాదం. మార్పు మంచికేనని అతిగా నమ్మినట్టున్న మస్క్ ట్విట్టర్‌లో ఏడాదిలో మరీ ఇన్ని మార్పులు చేయడమే విడ్డూరం.
ఏమైనా, ఉత్సాహం ఉరకలేస్తూ, స్నేహంగా, స్వేచ్ఛగా తలెత్తి చూస్తున్న నీలిరంగు బుర్రుపిట్ట తుర్రుమంది. నిగూఢతకూ, అపరిమితత్వానికీ ప్రతీకైన నల్లరంగు ఎక్స్ ముందుకొచ్చింది. మిగిలిన వ్యాపారాల మాటేమో కానీ సామాజిక మాధ్యమ వేదికగా ఇది నిలుస్తుందా? సరైన మరో స్వేచ్ఛా వేదిక అవసరమనే సందు తానే సృష్టించినందున భవిష్యత్తులో ఆ రంగంలో వచ్చే పోటీలో గెలుస్తుందా? ఇప్పటికే థ్రెడ్స్ లాంటివి తల ఎగరేస్తున్నాయి. మార్పు మంచికే అయినా, అన్ని మార్పులూ మంచివేనా అంటే ఏమో చెప్పలేం!
Elon Musk Changes In Twitter: మార్పులన్నీ మంచికేనా?
Published Thu, Jul 27 2023 12:00 AM | Last Updated on Thu, Jul 27 2023 11:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment