వైద్యులంతా సమయపాలన పాటించాలి
కలెక్టర్ వెట్రి సెల్వి
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం ఏలూరు బోధనాస్పత్రి నిర్వహణ తీరుపై సంబంధిత అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మినిస్టీరియల్ సిబ్బంది అంతా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. వైద్యులు, మినిస్టీరియల్ సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును రోజూ ఉదయం 9.30 గంటలకు తనకు నివేదించాలన్నారు. ఆస్పత్రి నిర్వహణపై వచ్చే ప్రతికూల వార్తలకు సంబంధించి ఉదయం 10.30 గంటలలోపు రిజాయిండర్లు సమర్పించాలని ఆదేశించారు.
వైద్య విద్యార్థులను చైతన్యపరిచి.. ఆస్పత్రిలో వైద్యుల కొరత నివారించేందుకు డీఆర్‌పీ వైద్య విద్యార్థుల నియామకంపై డీసీహెచ్‌ఎస్‌తో సమీక్షిస్తూ ఈ విషయంపై ఆశ్రం ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులను చైతన్యం పరిచి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. వైద్యసేవలు అందించేందుకు ముందుకు వచ్చే బెస్ట్ డీఆర్‌పీలకు అవార్డులు అందించి సత్కరిస్తామన్నారు. డిప్యూటేషన్‌పై ఇద్దరు వైద్యులను క్యాజువాలిటీ సేవలు అందించేందుకు నియమించాలని డీఎంహెచ్‌ఓ శర్మిష్టను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ బోధనాస్పత్రికి సంబంధించిన హజరును కూడా ఉదయం 10 గంటలలోపు సమర్పించాలన్నారు. సదరం, డాక్టర్ ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికెట్ల జారీకి వైద్యుల కొరత ఉండటంపై ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఆస్పత్రి బయట పార్కింగ్ చేసి ఉన్న ప్రైవేట్ అంబులెన్స్‌లకు సంబంధించి ఆర్‌టీఓతో సమన్వయం చేసుకుని ధరల పట్టిక బోర్డును క్యాజువాలిటీ వార్డు వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు, డీఎంహెచ్‌ఓ ఎస్.శర్మిష్ట, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పాల్ సతీష్‌కుమార్, ఆర్‌ఎంఓ డి.దుర్గాకుమార్, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఆస్పత్రి ఏడీ కుమార్, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆస్పత్రిలో విభాగాల పరిశీలన
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రిని కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెరుగైన వైద్యసేవలందించడంతో విఫలమవుతున్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె స్వయంగా ఓపీ తీసుకుని, సాధారణ పేషెంట్‌లా ఆర్థోపెడిక్ వైద్య విభాగంలో వైద్య చికిత్స చేయించుకున్నారు. వైద్యులు రాసిన మందుల చీటీతో కౌంటర్ వద్దకు వెళ్లి మందులు తీసుకున్నారు. మందులను రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారా లేదా అనేది ఆరా తీశారు. హాస్పిటల్‌కు వచ్చే రోగులకు ఓపీ సెంటర్‌ను తెలియజేసేందుకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారా? అంటూ అధికారులను ప్రశ్నించారు. అనంతరం హెల్త్‌కార్డు రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రికి వచ్చిన రోగులను వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment