వైకుంఠ ద్వార వైభవం | - | Sakshi
Sakshi News home page

వైకుంఠ ద్వార వైభవం

Published Thu, Jan 9 2025 1:57 AM | Last Updated on Thu, Jan 9 2025 1:56 AM

వైకుం

వైకుంఠ ద్వార వైభవం

ద్వారకాతిరుమల: శ్రీవారి గిరి ప్రదక్షిణ, అలాగే ఉత్తర ద్వార దర్శనానికి ద్వారకాతిరుమల దివ్య క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ రాజగోపురాలు, పరిసరాలు విద్యుద్దీప కాంతులీనుతున్నాయి. ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదనపు సిబ్బందితో క్షేత్ర పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు జరిపించారు. భక్తులు, గోవింద స్వాముల పాదాల రక్షణ కోసం గిరి ప్రదక్షిణ మార్గంలో గడ్డిని పరిచారు. దారిపొడవునా విద్యుత్‌ లైట్లు, సేదతీరేందుకు షామియానా పందిళ్లను నిర్మించారు. ఈ వేడుకలో స్వామివారు కొలువుదీరనున్న ధర్మప్రచార రథాన్ని పుష్ప మాలికలతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీవారి గిరి ప్రదక్షిణ వేడుక స్వామి వారి పాదుకా మండపం వద్ద గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు కలగనుంది.

గిరి ప్రదక్షిణ జరిగేదిలా..

ముందుగా ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, ఇన్‌చార్జి ఈఓ వేండ్ర త్రినాధరావు తదితరులు పాదుకా మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి, జెండా ఊపి గిరి ప్రదక్షిణ వేడుక ప్రారంభిస్తారు. ఈ యాత్ర మల్లేశ్వరం (దొరసానిపాడు రోడ్డు) మీదుగా గిరి చుట్టూ తిరిగి కొండపైన ఆశ్రమం వద్దకు చేరుతుంది. అక్కడి నుంచి ఉగాది మండపం మీదుగా ఆలయానికి చేరుకుంటుంది. 5 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు మధ్యలో మంచినీరు, పండ్లు, అల్పాహారాలు, టీలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆంబులెన్స్‌, నడవలేని భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం ఉచిత బస్సును ఏర్పాటు చేస్తోంది.

అత్యవసర ఎగ్జిట్‌ గేట్లు : క్యూలైన్లలో ప్రతీ 30 అడుగులకు ఒక అత్యవసర ఎగ్జిట్‌ గేటును ఏర్పాటు చేశారు. అడుగడుగునా మంచినీటి సౌకర్యం, అల్పాహారం, స్నాక్స్‌ అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రథమ చికిత్సా కేంద్రాన్ని అనివేటి మండపం వద్ద ఏర్పాటు చేశారు.

వైభవంగా నిర్వహిస్తాం

శ్రీవారి వైభవాన్ని చాటేలా గిరి ప్రదక్షిణ, శుక్రవారం ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహిస్తాం. గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు, గోవింద స్వాములు పాల్గొననున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి 30 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం.

– వేండ్ర త్రినాథరావు, దేవస్థానం ఈఓ

ద్వారకాతిరుమలలో సర్వం సిద్ధం

నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి గిరి ప్రదక్షిణ

రేపు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం

నిజరూపంలో దర్శనమివ్వనున్న స్వామివారు

ఉత్తర ద్వార దర్శనం ఇలా..

ఉచిత దర్శనం చేసుకునేవారు, రూ.100, రూ.200, రూ.500 టికెట్ల ద్వారా వెళ్లే భక్తులు ఆలయ తూర్పు ప్రాంతంలోని సప్తగోకులం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా, ఉత్తర రాజగోపురం లోంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు.

నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్న భక్తులు పడమర రాజ గోపురం పక్కనున్న ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా, ఉత్తర రాజగోపురం లోంచి ఆలయంలోకి వెళ్తారు.

వీఐపీలు, వీవీఐపీలు, గోవింద స్వాములు, స్థానిక భక్తులు నూతనంగా నిర్మించిన క్యూకాంప్లెక్స్‌, అనివేటి మండపం మధ్యలోంచి ఏర్పాటు చేసిన క్యూలైన్‌ ద్వారా, దక్షిణ రాజగోపురంలోంచి ఆలయంలోకి వెళ్తారు.

దర్శనానంతరం భక్తులు ఆలయం లోంచి తూర్పు రాజగోపురం మీదుగా బయటకు వెళ్తారు. పడమర రాజగోపురంలోంచి అర్చకులు, పండితులకు మాత్రమే ప్రవేశం.

No comments yet. Be the first to comment!
Add a comment
వైకుంఠ ద్వార వైభవం 1
1/2

వైకుంఠ ద్వార వైభవం

వైకుంఠ ద్వార వైభవం 2
2/2

వైకుంఠ ద్వార వైభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement